ప్రభాస్ ని వ్యక్తిగతంగా ఒకసారి కలిసిన వారు జీవితంలో మర్చిపోలేరని ఎన్నో సందర్భాల్లో పరిశ్రమలో ప్రముఖులు చెబుతూ ఉంటారు. తన నడవడిక, ఎదుటి వారి పట్ల చూపించే శ్రద్ధ ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే అందరు డార్లింగ్ అని ప్రభాస్ ని ప్రేమగా పిలుస్తూ ఉంటారు. అంతేకాక సాయం చేయడంలో ముందుండే వ్యక్తి. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనడానికి ప్రభుత్వానికి నాలుగు కోట్ల విరాళం ఇచ్చారు.
ఇప్పుడు మరోసారి తన దగ్గర పనిచేస్తున్న సిబ్బందికి కోట్ల రూపాయల విలువ గల కారుని బహూకరించి వార్తల్లో నిలిచారు. ఎనిమిది సంవత్సరాలుగా తన దగ్గర పనిచేస్తున్న జిమ్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డి కి రేంజ్ రోవర్ కార్ ని బహూకరించి వారి కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
తన దేహదారుఢ్యం అత్యుత్తమ స్థాయిలో ఉండేలా ట్రైన్ చేసిన లక్ష్మణ్ పై ప్రేమతో ఈ బహుమతి అందించారు. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు ప్రభాస్ డార్లింగ్ ఆల్వేస్ యు రాక్ , వ్యక్తిత్వంలో నిన్ను మించిన వారు లేరు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ తదుపరి ఆది పురుష్, మరియు దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో నిర్మించబోతున్న చిత్రంలోనూ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.