సీనియర్ నటుడు జయ ప్రకాష్ రెడ్డి (71) ఈరోజు ఉదయం గుండెపోటుతో కన్ను మూసారు. ప్రస్తుతం షూటింగులు లేని కారణంగా గుంటూరులో ఉన్న ఆయన ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలానికి చెందిన జయప్రకాశ్ రెడ్డి నాటకరంగం నుండి సినీరంగంలోకి ప్రవేశించి ఎన్నో చిత్రాలలో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. బ్రహ్మపుత్రుడు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన “ప్రేమించుకుందాం రా” చిత్రంలో రెడ్డప్పగా, సమరసింహారెడ్డి చిత్రం లో వీర రాఘవ రెడ్డిగా మరెన్నో విలక్షణమైన పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన “సరిలేరు నీకెవ్వరు” చిత్రం జయప్రకాష్ రెడ్డి చివరిగా నటించిన చిత్రం.