లాక్ డౌన్ వలన సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభం ముందెన్నడూ చూడనిది. చిన్న చిత్రాల నుండి భారీ బడ్జెట్ చిత్రాల వరకూ చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు కోసం ఎదురు చూస్తున్నాయి. అందులో ఒకటి సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్. తాజాగా ఈ చిత్రం లో సిద్ద్ శ్రీరామ్ ఆలపించి తమన్ స్వరపరిచిన ‘హే ఇది నేనేనా’ అనే పాటను విడుదల చేశారు. 6 నెలల క్రితం విడుదల చేసిన టీజర్ లో సోలో బ్రతుకే సో బెటర్ అంటూ విప్లవకారుడు లాగా ఆవేశంగా స్పీచ్ ఇస్తున్న సాయి ధరమ్, ఇప్పుడు విడుదల చేసిన పాటలో నన్ను నేను మైమరచి పోతున్నా అంటూ అమ్మాయి వెనుక పడడం వెనక కథేంటో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.
సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహిస్తుండగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి థియేటర్లు తెరిచే వరకు నిర్మాతలు ఆగుతారా? లేక ఓటీటీ బాట పడతారో వేచిచూడాలి.