జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు అధః పాతాళానికి పడిపోయినా తిరిగి తను పోగొట్టుకున్న స్థానాన్ని సాధించినవాడే మొనగాడు. అలాంటి వ్యక్తే సుమన్ తల్వార్. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన కొన్ని చీకటి రోజులను మాత్రమే తెలుసుకుందాం. ఎందుకంటే గెలిచినప్పుడు మన వెన్నంటి ఎవడైనా ఉంటాడు. కానీ ఓడిపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
1980 ఇంకో హీరోతో కలిసి తెరను పంచుకొని సుమన్ నటించిన మొదటి తెలుగు సినిమా “తరంగిణి” సూపర్ డూపర్ హిట్ అయ్యి 20 కేంద్రాల్లో 365 రోజులు ప్రదర్శితమైంది. ఆ తర్వాత అతడు వెనుతిరిగి చూస్తే ప్రసక్తే లేకుండా అతడి ప్రస్థానం నడిచిపోయింది. ఎక్కడో కర్ణాటక మంగళూరు లో తుళు భాష మాట్లాడే సంస్కృతుల మధ్య పుట్టిన వ్యక్తి తెలుగు,తమిళ భాషల్లో ఎదుగుతున్న రోజులు.. తనకు సరిపోయే కథలను ఎంచుకుంటూ తనలో ఉన్న మార్షల్ ఆర్ట్స్ ని సినిమాల్లో ప్రదర్శిస్తూ 1988 వరకూ ఎదురు లేకుండా సాగిపోయాడు. హీరోగా తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్న రోజులు హఠాత్తుగా జరిగిన ఆ సంఘటన ఆయన జీవితంలో కారు మబ్బులు కమ్మి బొక్క బోర్లా పడేలా చేసింది. ఒకరాత్రి సుమన్ షూటింగ్ ముగించుకుని అప్పుడే ఇంటికి చేరాడు. అతడిని అనుసరిస్తూ వచ్చిన పోలీసులు ఇంటి నుండి కొన్ని అశ్లీల వీడియో టేపులను స్వాధీనం చేసుకున్నారు. ఏం జరిగిందో సుమన్ కి అర్థం అయ్యే లోపు పోలీసులు అరెస్ట్ చేసి జీప్ ఎక్కించారు. వెనువెంటనే జరిగిన పరిణామాలు ఎవరి ఊహకి అందని రీతిలో ఉన్నాయి.
సుమన్ తమని అపహరించాడని, అత్యాచారం చేశాడని మరియు నీలి చిత్రాలలో నటించమని బలవంతం చేశాడని ముగ్గురు యువతులు అతనిపై ఫిర్యాదు చేసారు. తన చుట్టూ ఏం జరుగుతుందో తనకు అర్థం కాక బుర్ర గోక్కుంటూ మనోడు గడుపుతున్న రోజులు. తరువాత పోలీసులు సుమన్ ని కారాగారానికి తరలించడం లాంటి పరిణామాలన్నీ సరవేగంగా జరిగిపోయాయి. తెల్లారేసరికి వార్తాపత్రికల్లో ఇదే హెడ్ లైన్స్, తన చుట్టూ ఉన్న ప్రపంచం అతడిని దోషిగా చూసింది. రేప్ కేసులో అరెస్టు కాబడిన హీరో అంటూ.. కానీ అదే సమయంలో అతడి మంచితనం వేరే రూపంలో అతనికి సహాయ పడింది. అతడితో నటించిన మహిళా నటీమణులు అతడు అలాంటి తప్పు చేసే మనిషి కాదని ఓపెన్ గా బయటకు వచ్చి ప్రకటించారు. ఆ మాటలను జనం నమ్మారా?
చట్టం తన పని తాను చేసుకు పోయింది. విచారణ జరుగుతున్న సమయంలోనే అతడు నటించిన అమెరికా అల్లుడు సినిమా విడుదలైంది. మహిళల పట్ల తప్పు చేశాడని అభియోగాలు మోపిన వ్యక్తి నటించిన సినిమా విడుదలైతే, మహిళలందరూ ఒకటికి రెండు సార్లు ఆ సినిమా చూసి ఘన విజయాన్ని అందించారు. అప్పుడు అర్థమైంది ఆ మహిళ నటీమణులు చెప్పిన విషయాన్ని ప్రజలు విశ్వసించారని. అతడు తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాము అని ప్రజలు కలెక్షన్ల రూపంలో చూపించారు. తదనంతర పరిణామాలలో ఆ ఆరోపణలన్నీ తమిళనాడు కోర్టులో తప్పు అని నిరూపించబడ్డాయి. అతడిపై పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేశాయి. అతడు తన పై పడిన మరకలను చెరుపుకొని తిరిగి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే సంపాదించుకున్నాడు. తను నిరపరాధి అని నమ్మిన ప్రజలను తన నటనతో అలరించాడు.
తదనంతర కాలంలో తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ ఇప్పటికీ పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం గా కొనసాగిస్తున్నాడు. అలాంటి జెంటిల్ మెన్ సుమన్ కి ట్రెండ్ ఆంధ్రా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.