అభిమానులు పవన్ కళ్యాణ్ ని తెరపై చూసి రెండు ఏళ్ళు దాటింది. 2018 జనవరిలో విడుదల అయిన అజ్ఞాతవాసి పవన్ నుండి వచ్చిన ఆఖరి చిత్రం. రాజకీయాల కారణంగా సినిమాలను పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్, ఎన్నికల తర్వాత రీ ఎంట్రీ లో ఒప్పుకున్న మొదటి చిత్రం వకీల్ సాబ్.అటు రాజకీయం.. ఇటు సినిమా.. సమన్వయం చేసుకుంటూ అతి తక్కువ రోజుల్లో చిత్రీకరణ పూర్తయ్యే సినిమాగా మొదలుపెట్టి చకచక షూటింగ్ పూర్తి చేశారు. దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తయిన తర్వాత కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ మూలంగా ఇటు షూటింగులు.. అటు థియేటర్లు మొదలు కాని పరిస్థితి.
అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో పరిమిత సభ్యులతో షూటింగ్ లకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వకీల్ సాబ్ టీం తమ చిత్రం షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ నెల 23వ తేదీ నుండి చిత్రంలోని మిగిలిన టాకీపార్ట్ చిత్రీకరణ పూర్తి చేసి థియేటర్లు ప్రారంభించే సమయానికి పూర్తిస్థాయిలో చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. కాగా పవన్ జన్మదినం సందర్భంగా విడుదలైన వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ అభిమానులను విశేషంగా అలరిస్తుంది. అటు అభిమానులు ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వకీల్ సాబ్ తెరపై కనిపించే రోజు ఎప్పుడు అనేది తేలాల్సి ఉంది.