Baahubali 2 Record Break : ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీ సక్సెస్ రేట్ అంతకంతకూ తగ్గుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. భారీ బడ్జెట్ తో విడుదలైన స్టార్ హీరోల సినిమాలు సైతం మార్నింగ్ షోకే ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుని భారీ నష్టాన్ని మూటకట్టుకున్నాయి. అయితే ఆ సినిమాలకు భిన్నంగా పఠాన్ మూవీ మాత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పఠాన్. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. తొలిరోజు నుంచే వసూళ్ల వేట మొదటి పెట్టిన ఈ మూవీ 1,000 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది.
తాజాగా, ఇండియాలో రూ.510.99 కోట్ల కలెక్షన్లు రాబట్టి రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ (హిందీ)ని అధిగమించింది. అంతేకాకుండా, ఇండియాలో హిందీ భాషలో అతిపెద్ద నెట్ గ్రాసర్ గా పఠాన్ నిలిచింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుక్ ఖాన్ వెండితెరపై సందడి చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం షారుఖ్ అట్లీ డైరెక్షన్ లో జవాన్ మూవీలో నటిస్తున్నాడు.