తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారినట్టు కనిపిస్తుంది. మంచి సినిమా అనిపిస్తే చాలు అది థియేటర్ అయిన ఓ.టి.టి ప్లాట్ ఫామ్ అయిన తప్పక ఆదరిస్తున్నారు. చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే సినిమా హిట్ చేస్తున్నారు.
అర్జున్ రెడ్డి, Rx 100 లాంటి డిఫరెంట్ లవ్ స్టోరీస్ ని కూడా ఆదరిస్తున్నారు. ఇపుడు అదే కోవలో వచ్చిన ఒక చిన్న సినిమా యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది. ఆ సినిమా పేరే ‘మాంగల్యం ‘
గతం లో ‘నిర్భందం’ సినిమాతో సంచలనం సృష్టించిన బండి సరోజ్ కుమార్ అన్ని తానే అయ్యి నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. కానీ సినిమా చూడాలి అనుకునే వాళ్ళు సినిమా ప్రారంభించడానికి ముందే “నా సినిమాలో బూతులు ఉంటాయ్”అని చెప్పిన దర్శకుడి మాటలు గమనించి ఇందులో బూతులు ఉన్నాయి అని సిద్ధపడే సినిమా చూడండి.
ఇక కథ విషయానికి వస్తె ప్రేమ లో మోసపోయిన దొరబాబు అనే ఒక వ్యక్తి నిరంతరం తాగుతూ, సమాజం మీద ఏహ్య భావం తో, కాంట్రాక్ట్ లకి మర్డర్ లు చేస్తూ ఉంటాడు. అలా అని అతను రౌడీ కాదు. ఒక లాయర్.
మరి ఆ రౌడీ లాయర్ అనుకోని పరిస్థితుల్లో, అతని స్నేహితుడి కోసం చేసిన ఒక మర్డర్ అతని జీవితాన్ని ఏ విధంగా గా మలుపు తిప్పింది అనేదే ఈ సినిమా కథ. క్లుప్తంగా కథ ఇదే అయిన సినిమాలో ప్రేక్షకుడిని అలరించే అనేక సన్నివేశాలు ఉన్నాయి.ముఖ్యం గా డైరెక్టర్ ప్రస్తుత సమాజ పోకడలను తన కథా వస్తువు గా తీసుకోవడం తో పాటు దానిని అద్భుతం గా చిత్రీకరించగలిగాడు.అయితే కొన్ని చోట్ల మహిళలకి ఇబ్బంది కలిగించే అడల్ట్ లాంగ్వేజ్ ఉన్నప్పటికీ ఆ భాష నీ ఆ పాత్ర పరిధి వరకు మాత్రమే చూడగలిగితే అవి అంత ఇబ్బంది కలిగించకపోవచ్చు.
ఇక నటీనటుల విషయానికి వస్తె దొరబాబు పాత్రలో సరోజ్ కుమార్ అత్యద్భుతం గా నటించాడు.అతని డైలాగ్స్ కి యూత్ ఫ్యాన్స్ అయ్యారంటే అతిశయోక్తి కాదు.సరైన అవకాశం లభిస్తే హీరో గా గానీ,విలన్ గా గానీ వెండితెర మీద తన స్థానం సుస్థిరం చేసుకుంటాడు అని చెప్పొచ్చు.సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టకుండా తన మార్క్ నటన తో అలరించాడు. హీరోయిన్ గా శ్రీదేవి పాత్రలో తెలుగు అమ్మాయి రేఖా బోజ్ నటన అద్భుతం అనే చెప్పాలి. పల్లెటూరి పిల్ల పాత్రలో చక్కని నటన కనబరిచింది. తన ఎక్స్ప్రెషన్స్, లుక్స్ ప్రస్తుతం ఉన్న హీరోయిన్ లకి ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయి.సరైన పాత్ర దొరికితే తను ఎంత బాగా నటించగలదు అనేది ఈ సినిమా ద్వారా తెలియజేసింది.
అలాగే హిమాన్షీ కాట్రగడ్డ కూడా మంచి పాత్రలో నటించడం జరిగింది.కుర్రాళ్ళు అంతా ఇలాంటి అమ్మాయి ప్రియురాలు గా ఉంటే బాగుంటుంది అనుకునే అంత అందమైన పాత్ర ఆమెది. నూతన్ నాయుడు, టేకుమూడి లక్ష్మణ్ ల పాత్రలు ఆకట్టుకుంటాయి.
చివరగా తెలుగు సినీ ఇండస్ట్రీ లో ప్రతిభ ఉన్నవాళ్ళకి కొదువ లేదు కానీ వాళ్ళకి లేనిది అవకాశాలు మాత్రమే. కానీ వాళ్ళకి ఏ చిన్న అవకాశం దక్కినా ఎంత అద్భుతాలు సృష్టించగలరు అనేదానికి ఉదాహరణ బండి సరోజ్ కుమార్.ఇలాంటి నటులు వెండి తెర మీద కూడా సంచలనాలు సృష్టించాలని కోరుకుందాం..
– BNB