Chiranjeevi Bobby: చిరంజీవి-బాబీ కాంబోలో యాక్షన్ ఎంటర్‌టైనర్.. హీరోయిన్ ఎవరంటే?
Chiranjeevi Bobby: ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు బాబీ కలయికలో రాబోయే తదుపరి చిత్రంపై సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నవంబర్ 5వ తేదీన అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.
పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ భారీ చిత్రంలో చిరంజీవి సరసన కథానాయికగా యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఎంపికైంది. ఇప్పటికే ప్రభాస్, మలయాళంలో మోహన్‌లాల్, తమిళంలో విక్రమ్ వంటి సీనియర్ స్టార్స్‌తో కలిసి పనిచేసి గుర్తింపు తెచ్చుకున్న మాళవికకు, ఇప్పుడు మెగాస్టార్‌తో జతకట్టే అరుదైన అవకాశం దక్కింది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఈ సినిమాకు ‘మిరాయ్’ చిత్ర దర్శకుడైన కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనుండడం విశేషం. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రాశీ ఖన్నా కూడా కీలక పాత్రలో నటించనుందనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. యంగ్ డైరెక్టర్ వసిష్ఠతో తీస్తున్న ‘విశ్వంభర’ చిత్రీకరణను పూర్తి చేసిన ఆయన, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్’ సినిమా చివరి దశ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తికాకముందే బాబీతో కొత్త సినిమాను మొదలుపెడుతున్న చిరంజీవి వేగం ఆయన డెడికేషన్‌కు నిదర్శనం. కాగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్’ (నయనతార కథానాయికగా నటిస్తున్నారు) చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
