రేటింగ్: 2.5/5
Star Cast : నాని, సుధీర్‌బాబు, అదితిరావ్ హైదరి, నివేదా థామస్, వెన్నెల కిషోర్
దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
విడుదల తేదీ: సెప్టెంబర్ 5, 2020
అటు ఇండస్ట్రీలోనూ ఇక సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న “V” చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. లాక్ డౌన్ వలన థియేటర్లు తెరుచుకునే పరిస్థితులు లేకపోవడం వలన పలు చిత్రాలు ఓటీటీ బాట పట్టాయి. కానీ, అవన్నీ చిన్న చిత్రాలే. కానీ తెలుగులో 40 నుండి 50 కోట్ల మార్కెట్ కలిగిన హీరోల చిత్రాలు ఏవి ఇప్పటివరకు ఓటీటీ వేదికపై విడుదల కాలేదు. చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో అమెజాన్ ప్రైమ్ ఓటిటి వేదికపై సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైంది.
మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని, సుధీర్ బాబు, నివేద థామస్, అతిథి రావు హైదరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు అందుకుందా?
ఎన్నో కేసులను విజయవంతంగా చేదించి, ప్రాణాలకు తెగించి ఎంతోమందిని కాపాడి ప్రభుత్వం నుండి ఉత్తమ పోలీస్ మెడల్ గెలుచుకున్న డిసిపి ఆదిత్యకు, తన టీం లోని పోలీస్ అధికారి ని చంపి దమ్ముంటే నన్ను పట్టుకో, లేకపోతే రాజీనామా చెయ్ అంటూ సవాల్ విసిరిన ట్రైన్డ్ సీరియల్ కిల్లర్ కథే ఈ చిత్రం.
అసలు ఆదిత్యకు ఆ కిల్లర్ కి ఉన్న సంబంధం ఏంటి?
ఆ కిల్లర్ వెనుక ఉన్న అసలు కథేంటి అనే ఆసక్తికర అంశమే సినిమాను నడిపించింది. ఫస్టాఫ్ వరకు పర్వాలేదు. సెకండాఫ్ సినిమా.. విడుదలకు ముందు నాని చెప్పినట్లు సీటు చివరన కూర్చొని చూసేంత ఉత్కంఠత అయితే లేదు. సినిమాలో కీలకమైన సస్పెన్స్ భాగం ఒక సాధారణ క్యారెక్టర్ ద్వారా చెప్పడం ప్రేక్షకులకు ఎంత వరకు రుచిస్తుందో చెప్పలేం. సాధారణ సినిమాల పడికట్టు సూత్రమైన సినిమా మొదలైన 20 వ నిమిషంలో అసలు కథలోకి ప్రవేశించి.. సినిమాలో మెయిన్ హీరో క్యారెక్టర్ మోటివ్ ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.
ఈ తరహా చిత్రాలు అన్నీ క్రైమ్& పనిష్మెంట్ పంథాలో సాగినట్లే అదే బాటలో పయనించింది. మాస్ ప్రేక్షకులు ఇష్టపడే క్రైమ్ ఎలిమెంట్ ని క్లాస్ ట్రీట్మెంట్ తో తెరకెక్కించారు మోహన కృష్ణ ఇంద్రగంటి. నానీ ని డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేసినా అతని క్యారెక్టర్ డిజైన్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.
డిసిపి ఆదిత్య పాత్రలో నటించిన సుధీర్ బాబు క్యారెక్టర్ ప్రజెంట్ చేసిన తీరుకంటే నాని క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం తక్కువే అని చెప్పాలి.
ఇప్పటివరకు పక్కింటి కుర్రాడు తరహ పాత్రల్లో నటించిన నాని ఈ చిత్రంలో కిల్లర్ పాత్రను అలవోకగా చేసుకుంటూ వెళ్లి పోయాడు. తననుండి ఆశించే చిలిపిదనం ఈ పాత్రలో ఏ మాత్రం ఆశించకండి. డిసిపి ఆదిత్య పాత్రలో నటించిన సుధీర్ బాబు విషయానికి వస్తే తన పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేసాడు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఆఖరి నిమిషం వరకు సుధీర్ బాబు పాత్ర హీరో అనే తరహాలో సాగింది. ఇక క్రిమినల్ సైకాలజీ చేసిన అపూర్వ రామానుజన్ పాత్రలో హీరోయిన్ నివేద థామస్ తన పరిధి వరకు బాగానే చేసింది. కాకపోతే ఆ పాత్రను కథనంలో ఇంకాస్త ఉపయోగించుకుంటే బాగుండేది.
ఇక సినిమాలో కీలక పాత్ర పోషించిన అతిధి రావు హైదరి జస్ట్ ఐదు సీన్లు ఒక పాట వరకు మాత్రమే పరిమితమైంది. ఉన్నంతలో ఫరవాలేదు. నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పరుగులు పెడుతూ సాగిపోవడం ఒకింత అసంతృప్తిగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ కిషోర్ లాంటి స్టార్ కమెడియన్ ఉన్నా క్రైమ్ అండ్ సస్పెన్స్ చిత్రం కాబట్టి హాస్యంపై పెద్దగా దృష్టి సారించలేదు.
ఒక పాట మినహా మిగిలిన పాటలు అలా వచ్చి వెళ్లిపోయేవే తప్ప గుర్తుంచుకోదగినవి కాదు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బడ్జెట్ కు తగినట్లుగా ఉంది. తనకు అలవాటు అయిన కాపీ పద్ధతిలో బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు చిత్రం బ్యాక్ గ్రౌండ్ ధీమ్ ని అటు ఇటు గా మార్చి ఇచ్చేసాడు. పీజీ విందా సినిమాటోగ్రఫీ సినిమాను కాపాడింది లేకపోతే అస్సామే..
దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ , ఇతర సాంకేతిక నిపుణుల పనితీరు పరవాలేదు.
ఓవరాల్ గా ఈ చిత్రం ఓటీటీకి ఎక్కువ థియేటర్ కి తక్కువ అన్నట్లుగా ఉంది.
Trend Andhra Rating 2.5/5
– బాలాజీ జుజ్జువరపు