Pawan Kalyan : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల ప్రభాస్ ఎపిసోడ్ ప్రసారం కాగా సర్వర్లు క్రాష్ అయ్యాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హాజరైన ఎపిసోడ్ పై అంతకు మించిన అంచనాలు ఉన్నాయి. పవన్ తొలి ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అభిమానుల నిరీక్షణకి తెరదించుతూ.. పవన్, బాలయ్య తొలి ఎపిసోడ్ నిన్న స్ట్రీమింగ్ మొదలైంది. బాలయ్య పవన్ ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానాలు ఇస్తారు? ఇక తన వ్యక్తిగత జీవితం.. 3 పెళ్లిళ్లపై పవన్ ఓపెన్ అవుతాడా? ఇలా అనేక అంశాలపై ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. అనుకున్నట్లుగా తన పెళ్లిళ్ల గురించి బయట జరుగుతున్న చర్చకి ఎదురవుతున్న విమర్శలకు పవన్ అన్ స్టాపబుల్ వేదికగా చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
‘పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా’ అని చాలా సింపుల్‌గా బాలయ్య అడిగేసినా.. పవన్ కళ్యాణ్ మాత్రం చాలా క్షుణ్ణంగా వివరణ ఇచ్చారు. ‘‘జీవితంలో అసలు పెళ్లే చేసుకోకూడదు అనుకున్నా. బ్రహ్మచారిగా ఉండిపోవాలి.. యోగామార్గంలోకి వెళ్లాలి అనుకున్నా. కానీ, నా జీవిత ప్రయాణం చూసుకుంటే.. నేనేనా.. నాకేనా ఇన్నిసార్లు జరిగాయి అనిపిస్తుంది. ఏదీ నేను ప్లాన్ చేయలేదు. నేను ఎప్పుడూ చాలా సంప్రదాయబద్ధంగా బతికే వ్యక్తిని.
ఫస్ట్ నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు చాలా సంప్రదాయబద్ధమైనది, ఇంట్లో వాళ్లు చూసింది. రిలేషన్‌షిప్‌లో కొన్ని కుదరవు కాబట్టి విడిపోతారు. రెండోసారి పెళ్లిచేసుకున్నప్పుడు ఏకాభిప్రాయం రాకో.. వేరే ఏదో కారణంతో విడిపోయాం. ప్రతీసారి మూడు పెళ్లిళ్లు అంటుంటే.. ముగ్గురినీ ఒకేసారి చేసుకోలేదురా బాబు, ముగ్గురితో ఒకేసారి ఉండట్లేదు, ఒక వ్యక్తితో కుదరలేదు ఇంకోసారి చేసుకోవాల్సి వచ్చింది. ఆ వ్యక్తితో కుదరలేదు ఇంకోసారి చేసుకున్నాను. నేనేదో కోరుకొనో వ్యామోహంతో చేసుకోలేదు, జరిగాయంతే’’ అని పవన్ కళ్యాణ్ వివరించారు.
తాను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి విమర్శించడానికి అదొక ఆయుధంలా అయిపోయిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తాను ఎంతోమంది అధికారులను, తనను విమర్శించే ఎంతోమంది నాయకుల వ్యక్తిగత జీవితాలను చూశానని, వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో తనకు మించిన ఆసక్తికర విషయాలు ఉన్నాయని అన్నారు. అయితే, తన సంస్కారం వాళ్ల గురించి మాట్లాడనివ్వదని, చెప్పనివ్వదని అన్నారు.
Also Read: వంటగది ఇలా ఉంటే లక్ష్మీదేవి కటాక్షం కలగడం ఖాయం..?
ఇక ఈ అంశానికి ఫుల్‌స్టాప్ పెడుతూ బాలయ్య.. ‘‘పవన్ కళ్యాణ్‌ను అనడానికి ఏముంది. క్లియర్ ఉంటాడు.. స్ట్రయిట్ ఫార్వాడ్‌గా ఉంటాడు. ఏదో ఒకటి అనాలి. అతని సమర్థతను కవర్ చేయడం కోసం ఏవో పిచ్చి మాటలు మాట్లాడాలి. భయ్యా.. ఈ స్టేజ్ మీది నుంచి నేను ఒక ప్రకటన చేస్తున్నాను. ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా.. ఇంకొక్కసారి ఆయన గురించి, పెళ్లిళ్ల గురించి మాట్లాడితే మీరు ఊరకుక్కలతో సమానం’’ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి స్క్రీన్ మీద బాలయ్య, పవన్ బంధం అదిరిపోయింది.