పవన్ కళ్యాణ్ నటించబోయే 28 వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ పవన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఇండియా గేట్ ముందు పార్క్ చేసి ఉన్న బైక్ పై పెద్ద బాలశిక్ష పుస్తకంతో పాటు PSPK అనే అక్షరాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లతో కూడిన ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. పోస్టర్ క్రింది భాగంలో ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అనే క్యాప్షన్ తో ఉత్సుకత రేకెత్తించే విధంగా పోస్టర్ డిజైన్ చేయబడింది.
గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రాన్ని ఇప్పటికీ అభిమానులు మరువలేరు. నాక్కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది అంటూ పవన్ బాక్సాఫీస్ లెక్కలు తేల్చిన కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. మెగా కాంపౌండ్ చిత్రాలకు అదరగొట్టే మ్యూజిక్ అందించే దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం మరొక ఆసక్తికర విషయం. ఏదేమైనా పవన్ నుండి ఎప్పుడూ రాని విధంగా వరుస చిత్రాల ప్రకటనలు తన పుట్టిన రోజునాడు రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.