సాధారణంగా చాలా సందర్భాల్లో మన జీవితంలో జరిగే కొన్ని ప్రత్యేకమైన విశేషాలకు మనకు ఎంతోమంది శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు. సోషల్ మీడియా వచ్చాక అందరూ వారి శుభాకాంక్షలను ఆశీస్సులను ట్విట్టర్ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా తమ స్నేహితులకు సన్నిహితులకు పంపించడం మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే, చాలా సందర్భాల్లో పనుల వత్తిడి వల్ల కానీ ఆ రోజు జరిగే వేడుకల్లో తలమునకలై ఉండటం వల్ల కాని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి తిరిగి ధన్యవాదాలు తెలిపే వీలు ఉండకపోవడం వల్ల నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అందరికీ ఒకేసారి కృతజ్ఞతలు చెప్పినట్టుగా ప్రకటిస్తాం. పేరుపేరునా అంటాం కానీ అక్కడ ఎవరు పేరు చెప్పము, ఎవరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుము. అయితే ఈ నెల రెండవ తారీకున తన 49వ పుట్టినరోజు జరుపుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈమాటకు అసలైన జస్టిఫికేషన్ ఇచ్చారు.
సెలబ్రిటీల జన్మదినం అంటేనే సాధారణంగానే సినీ రాజకీయ వర్గాల నుంచి బంధుమిత్రుల నుంచి వెల్లువలా శుభాకాంక్షలు వస్తూ ఉంటాయి. అయితే చాలా తక్కువ మందికి మాత్రమే తిరిగి రిప్లై ఇచ్చి, మిగిలిన వారికి అందరికీ కలిపి ఒకేసారి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని తెలియజేస్తూ ప్రకటనలు చేయడం కూడా మనకు తెలిసిందే.
కానీ, ఈసారి రొటీన్ కి భిన్నంగా పవన్ కళ్యాణ్ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ తిరిగి రిప్లై ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ ల నుంచి ఆయనతో నటించిన సీనియర్ హీరోయిన్ల వరకు అందరికీ పేరుపేరునా సెప్టెంబర్ 3 అర్ధ రాత్రి వరకు కూడా ఆయన రిప్లై ఇవ్వడం అటు ఆయన అభిమానులతో పాటు నెటిజన్స్ నీ కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఆయన కృతజ్ఞతలు తెలిపిన వారిలో ఆయన నుండి రిప్లై వస్తుంది అని కలలో కూడా ఊహించనీ సినిమా యాక్టర్లు, ఆయన అభిమానులు కూడా ఉండటం విశేషం. ఆయన ఇచ్చిన రిప్లై ని చూసి సంపూర్ణేష్ బాబు, సందీప్ కిషన్, కార్తికేయ, ప్రదీప్ మాచిరాజు, శ్రీముఖి లాంటి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేసిన ఆనందం అంతా ఇంతా కాదు.
అందులోను ప్రతి ఒక్కరి గురించి వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా రిప్లై ఇవ్వడం అనేది మామూలు విషయం కాదని ఆయన అభిమానులు అంటున్నారు. ఈ రిప్లై ల పరంపర సెప్టెంబర్ 3 అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఆయనతో పాటు ఆయన అభిమానులు కూడా ఎప్పుడు ఎవరికీ రిప్లై ఎలా ఇస్తారా అని ఆసక్తిగా ఎదురు చూశారు. ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ను సోషల్ మీడియా టీం హ్యాండిల్ చేస్తుందని కొందరు అభిప్రాయపడిన కూడా అందరికీ ఒకేలా కృతజ్ఞతలు తెలిపితే అనుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేకంగా ఇవ్వడం చూస్తుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అని గట్టిగా చెబుతున్నారు ఆయన అభిమానులు. ఇకపోతే ఈసారి ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక్క తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మాత్రమే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమ మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి కూడా ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. ఏదేమైనా “శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు” అనే మాటకు అసలైన అర్థం చెప్పి రిప్లైలు ఇవ్వడంలో కూడా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేశారు అని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.