Pawan Kalyan Speech: పవన్ కళ్యాణ్ ప్రసంగం
జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు చిత్రం జూలై 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ శిల్ప కళావేదికలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా పవన్ ప్రసంగం కొనసాగింది. చిత్ర మొత్తాన్ని అభినందిస్తూ, చిత్ర కథా నేపథ్యం తెలియజేస్తూ, రాజకీయ అంశాలు స్పృశిస్తూ అభిమానులని అలరించే పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
రాజకీయాల్లోకి వచ్చాక నేను మంచి మిత్రుడిని సంపాదించుకున్నాను. ఆయనే కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ ఈశ్వర్ ఖన్ద్రే గారు అని పవన్ తెలిపారు. కొన్నేళ్ల క్రితం భీమ్లా నాయక్ చిత్రం రిలీజ్ అయినప్పుడు అప్పటి ప్రభుత్వం కావాలనే నా సినిమా టికెట్ ధరల్ని రూ 10, రూ 15 చేసింది. అప్పుడు నేను ఒక మాట చెప్పాను .. మనల్ని ఎవడ్రా ఆపేది అని. ఇది డబ్బు, రికార్డుల గురించి కాదు.. ఇది కేవలం ధైర్యం గురించి అని పవన్ అన్నారు.

నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటే, పడిలేచాను అంటే అందుకు కారణం మీరే అని పవన్ అభిమానులని ఉద్దేశించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నేను నటించిన తొలి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి వచ్చి దాదాపు 30 ఏళ్ళు అవుతోంది. కాలం వేగంగా గడిచిపోయింది. జానీ చిత్రం ఫ్లాప్ కావడంతో నా పరిస్థితి మొత్తం మారిపోయింది.
రీమేక్ లే చూస్తుంటానని అంటుంటారు
నేను ఎప్పుడూ రీమేక్ సినిమాలే చేస్తుంటానని మీరు అంటుంటారు. కానీ నన్ను ఏం చేయమంటారు ? నాకు దర్శకులు దొరకలేదు. నేను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నపుడు వెతుక్కుంటూ వచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. దేవుడిచ్చిన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని పవన్ తెలిపారు. రీమేక్ సినిమాలు చేయడం సులభం. కొత్త కథలు తీస్తే చాలా సమయం పడుతుంది. జనసేన పార్టీని నడపాలి.. నా కుటుంబాన్ని పోషించుకోవాలి.అందుకే రీమేక్ సినిమాలు చేశాను అని పవన్ తెలిపారు.
కానీ హరిహర వీరమల్లు లాంటి సినిమా చేయగలిగాను అంటే అందుకు కారణం ఏ ఎం రత్నం గారు. అదే విధంగా క్రిష్ జాగర్లమూడి అని పవన్ అన్నారు. హరిహర వీరమల్లు చిత్రానికి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కీరవాణి గారి సంగీతం ఈ చిత్రాన్ని నిలబెట్టింది అని తెలిపారు. నిధి అగర్వాల్ గత నెలరోజులుగా చిత్రానికి ఒంటరిగా ప్రమోషన్స్ చేసింది.
హరిహర వీరమల్లు కథా నేపథ్యం ఇదే
మన పాఠ్య పుస్తకాల్లో మొఘల్ సామ్రాజ్యం గొప్పతనం చెప్పారు కానీ, వారి అరాచకాలు చెప్పలేదు. మొఘల్ నేపథ్యంలో ఔరంగజేబు అరాచకాలని ఈ చిత్రంలో చూపించాం. కృష్ణానది తీరంలో దొరికిన కోహినూర్ వజ్రం నిజాం నవాబుల చేతిలోకి ఆ తర్వాత మొఘల్ చక్రవర్తుల చేతులోకి వెళ్ళింది. ఇప్పుడు అది లండన్ మ్యూజియంలో ఉంది అని పవన్ అన్నారు. మొఘల్ సామ్రాజ్యం, కోహినూర్ డైమండ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది అని పవన్ అన్నారు. ఈ చిత్రంలో క్లైమాక్స్ ఫైట్ 18 నిముషాలు ఉంటుంది.ఆ సన్నివేశాన్ని నేనే డిజైన్ చేశాను. ఈచిత్రం ఎన్ని రికార్డులు సాధిస్తుందో తెలియదు. మీకు నచ్చితే బద్దలు కొట్టేయండి అని పవన్ అన్నారు.