Prakash Raj: ప్రకాష్ రాజ్ విలక్షణ పాత్రలకు తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. తెలుగు, తమిళ భాషల్లో విలక్షణమైన విలనిజానికి సరికొత్త సొబగులద్దిన ప్రకాష్ రాజ్ కెరీర్ లో ఎన్నో విజయాలతో పాటు మరికొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు ప్రకాశ్ రాజ్. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ.
తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం నిర్మాతల పాలిట కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి వివాదాలు ఎదుర్కొంటూనే ఉంది. ఇటీవల గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFI) జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ కొన్ని రోజుల క్రితమే ఇదో వల్గర్ సినిమా అని విమర్శించారు.
Also Read: అభిమానులకు అండగా పవన్ నిర్మాతలు
ఆ ఘటనను మరచిపోకముందే తాజాగా తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ స్పందిస్తూ కశ్మీర్ ఫైల్స్ మూవీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అర్థం పర్థం లేని సినిమాల్లో కశ్మీర్ ఫైల్స్ కూడా ఒకటని ఆయన ఫైర్ అయ్యారు. ఇంటర్నేషనల్ జ్యూరీ కూడా దీన్ని పట్టించుకోలేదన్నారు.
నాకు ఆస్కార్ ఎందుకు రాలేదని ఆ సినిమా డైరెక్టర్ ఇప్పటికీ అంటున్నారని ఆయన చెప్పారు. ఆస్కార్ కాదు కదా కనీసం ఆయనకు భాస్కర్ అవార్డు కూడా రాదని ఎద్దేవా చేశారు. ఇదో ప్రాపగాండా ఫిల్మ్ అని విమర్శించారు. ఇలాంటి ప్రచార చిత్రాలను నిర్మించేందుకు కొందరు భారీ పెట్టుబడులు పెట్టారని తెలిసిందన్నారు.
దీనికోసం 2000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారని తనకు తెలిసిన వాళ్లు చెప్పారని ఆయన పేర్కొన్నారు. కానీ.. ప్రజల్ని ఎల్లప్పుడూ మోసపుచ్చలేరని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలతో ఆ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించడంతో వీరి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది.