Rajeev Kanakala Police notice : చిక్కుల్లో రాజీవ్ కనకాల
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఊహించని చిక్కుల్లో పడ్డారు. ఒక ఫ్లాట్ సేల్ ఫ్రాడ్ వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైంది. పసుమాముల రెవెన్యూ పరిమితుల్లోని పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలో ఉన్న ఒక ఫ్లాట్ కొనుగోలు వ్యవహారంలో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. రాజీవ్ కనకాల గతంలో ఆ ఫ్లాట్‌ను విజయ్ చౌదరి అనే వ్యక్తికి అమ్మారు. అనంతరం విజయ్ చౌదరి అదే ఫ్లాట్‌ను శ్రవణ్ రెడ్డికి అమ్మారు.
ఫ్లాట్ అమ్మకంలో మోసం ?
అయితే శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ, తాను ఆ ఫ్లాట్ కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటి వరకు తనకు స్వాధీనం కాలేదని తెలిపారు. దీనితో శ్రవణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను కొన్న ఫ్లాట్ వ్యవహారంలో ఏదో మోసం జరిగింది అని శ్రవణ్ పోలీసులకు తెలిపారు. ఈ ఫిర్యాదుతో రాచకొండ పోలీసులు కేసు నమోదు చేసి, రాజీవ్ కనకాలతో పాటు విజయ్ చౌదరికి కూడా నోటీసులు పంపించారు. ఇప్పటివరకు రాజీవ్ కనకాల ఈ వ్యవహారంపై స్పందించలేదు.
ఇటీవల ‘గేమ్ చేంజర్’, ‘చౌర్య పాఠం’, ‘డియర్ ఉమా’ వంటి చిత్రాల్లో నటించిన రాజీవ్ కనకాల, సాధారణంగా మీడియా దృష్టికి దూరంగా ఉంటూ, తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచేవారు. కానీ ఈ ఘటన వల్ల ఆయన వార్తల్లో నిలిచారు.
ఈ ఫ్లాట్ వ్యవహారంపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . అసలు విషయాలు, న్యాయపరమైన అంశాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. నిబంధనల ప్రకారం నోటీసులకు స్పందించి విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ కేసు తదుపరి దశలో ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.