ఏడు నెలల తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. అన్ లాక్ తర్వాత షూటింగులు ప్రారంభమై చాలా చిత్రాలు నిర్మాణ పనులు జరుపుకుంటున్నాయి. థియేటర్లు తెరవడానికి అనుమతులు లభించినా సింగిల్ స్క్రీన్ థియేటర్లు రాష్ట్రంలో తెరుచుకోలేదు. అక్కడక్కడ మల్టిప్లెక్స్ లు ఓపెన్ చేసినా కేవలం పదిమంది లోపు ప్రేక్షకులతో థియేటర్లు నడపలేక ప్రదర్శనలు రద్దు చేసుకున్నారు. చిత్ర పరిశ్రమకు అత్యధిక కలెక్షన్లు రాబట్టే రోజులైనా వేసవి సెలవులు, దసరా సెలవులు కోవిడ్ కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి.
ఇక రానున్న సంక్రాంతికి ఒక్కొక్కరూ బెర్త్ కన్ఫామ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సంక్రాంతికి రానున్నట్లు తెలిసింది. ఇక ఇప్పుడు రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, సామ్రాట్, జోయా హుస్సేన్ ప్రధాన పాత్రధారులుగా తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఏరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో తెరకెక్కుతున్న అరణ్య చిత్రం సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న అరణ్య పూర్తిగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. సంక్రాంతి బరిలో నిలవడానికి టీం సన్నాహాలు చేస్తున్నట్లు రానా దగ్గుబాటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి మధ్య, మన అడవులు కూడా పారిశ్రామికీకరణ మరియు అటవీ నిర్మూలన పేరుతో జరుగుతున్న విధ్వంసక మహమ్మారితో పోరాడుతున్నాయి! ఇది ఎప్పుడు ఆగిపోతుంది? ఈ ఉత్కంఠభరితమైన యుద్ధాన్ని చూపడానికి 2021 సంక్రాంతికి మీ ముందుకు వస్తున్నాం అంటూ రానా సోషల్ మీడియా లో ప్రకటించారు. రానా ప్రస్తుతం అరణ్య చిత్రం తో పాటు , “నీది నాది ఒకే కథ” ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం చిత్రంలో నటిస్తున్నాడు.