Jai Hanuman: ‘జై హనుమాన్’ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదా?.. రిషబ్ శెట్టి వ్యాఖ్యలతో ఫ్యాన్స్ షాక్
Jai Hanuman: ‘కాంతార చాప్టర్ 1’ వంటి సంచలన విజయంతో దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ స్టార్ రిషబ్ శెట్టి, తన తదుపరి చిత్రం ‘జై హనుమాన్’ గురించి చేసిన తాజా వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, రిషబ్ శెట్టి ఇచ్చిన అప్‌డేట్ అభిమానుల్లో కొంత నిరాశను కలిగించింది.
‘కాంతార చాప్టర్ 1’ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి, తన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి స్పందించారు. “చాప్టర్ 1 తర్వాత నేను చేసే సినిమా ‘జై హనుమాన్’. ఇది ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ఉంటుంది. ఈ చిత్రం 2026 జనవరిలో సెట్స్‌పైకి వెళ్తుంది. ఆ తర్వాత, నా దర్శకత్వంలో వచ్చే మరో సినిమా రెండేళ్లలో విడుదలవుతుంది,” అని ఆయన వెల్లడించారు.
రిషబ్ శెట్టి ఈ ప్రకటన చేయగానే, అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇప్పటివరకు సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదా? 2026 జనవరిలో ప్రారంభమైతే విడుదల ఎప్పుడు? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు. గతంలో ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పుడు షూటింగ్ ప్రారంభమైందని అభిమానులు భావించారు. కానీ, ఆ లుక్ కేవలం ఫోటోషూట్‌కు మాత్రమే పరిమితమైందని, అసలు షూటింగ్ ప్రారంభానికి ఇంకా సమయం ఉందని ఇప్పుడు స్పష్టమైంది. 2026 జనవరిలో సెట్స్ పైకి వెళితే, గ్రాఫిక్స్, పోస్ట్-ప్రొడక్షన్ వంటి భారీ పనులన్నీ పూర్తి కావడానికి కనీసం 2027 వరకు వేచి చూడక తప్పదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మధ్యలోనే రిషబ్ తన సొంత దర్శకత్వంలో మరో చిత్రాన్ని కూడా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ చిత్రం అఖండ విజయం సాధించిన నేపథ్యంలో, దాని సీక్వెల్ అయిన ‘జై హనుమాన్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. రిషబ్ శెట్టి లాంటి పర్‌ఫార్మర్ ప్రధాన పాత్రలో నటించనుండడంతో హైప్ మరింత పెరిగింది. ఆలస్యం అయినప్పటికీ, విజన్ ఉన్న దర్శకుడు, బలమైన కథతో వస్తున్న ఈ సినిమా కోసం ఎంత కాలమైనా ఎదురుచూస్తామని కొందరు అభిమానులు తమ మద్దతును తెలుపుతున్నారు.