ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణంతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ‘సిపాయి కూతురు’లో తొలిసారి వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆయన 2019లో ‘మహర్షి’ సినిమాలో చివరిసారిగా కనిపించారు. 1935లో కృష్ణా జిల్లాలో జన్మించిన కైకాల, నాటకాల్లో రాణించారు. ఆ అనుభవంతో సినిమా వేషాల కోసం మద్రాసు వెళ్లారు.
సిపాయి కూతురు అనే సినిమాలో చిన్న పాత్ర పోషించారు. ఆ సినిమా ఫెయిల్ అయినపప్పటికీ సత్యనారాయణ అందర్నీ ఆకర్షించారు. నిండైన రూపం, కంచు కంఠం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. సాంఘికాలతో పాటు.. పౌరాణిక పాత్రలైన రావణుడు, ధుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు లాంటి పాత్రల్ని కైకాల పోషించారు. పౌరాణికాల్లో రాముడు, కృష్ణుడు పాత్రలకు ఎన్టీఆర్ ఎలా స్థిరపడిపోయారో, అదే పౌరాణికాల్లో రాక్షస పాత్రలకు కైకాల అలా స్థిరపడ్డారు.
కేవలం నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, రాజకీయనాయకుడిగా కూడా కైకాల విశేష ప్రతిభ కనబరిచారు. కొదమసింహం, ముద్దుల మొగుడు, బంగారు కుటుంబం లాంటి సినిమాలు నిర్మించింది ఈయనే. వీటిలో బంగారు కుటుంబం సినిమాకు నంది అవార్డ్ కూడా అందుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు మరెన్నో అవార్డులు అందుకొని, తెలుగు చిత్రసీమలో ఓ అధ్యాయాన్ని లిఖించారు కైకాల సత్యనారాయణ. 770కి పైగా సినిమాల్లో నటించి తనకుతానే సాటి అనిపించుకున్న కైకాల, వయసురీత్యా సినిమాలకు దూరమయ్యారు.