Senior Actress Jamuna Passes Away : జమున అంటే చాలు.. తొలి గ్లామర్ హీరోయిన్.. నటనలో ఓ చిలిపితనం, సొగసుదనం, గడుసుతనం అన్నీ గుర్తుకు వస్తాయి. ఏ పాత్ర వేస్తే అందులోకి ఆమె పరకాయ ప్రవేశం చేస్తారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. గత రాత్రి హైదరాబాద్ లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆమె మరణవార్త తెలిసి టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు భౌతిక ఖాయాన్ని ఫిలిం ఛాంబర్ కి తీసుకురానున్నట్లు సమాచారం.

జమున వయసు 86 సంవత్సరాలు. 1936 ఆగస్ట్ 30న ఆమె జన్మించారు. ఆమె మాతృ భాష తెలుగు కాకపోయినప్పటికీ తెలుగు పరిశ్రమనే తన సొంత పరిశ్రమగా భావించి ఇక్కడే స్థిరపడిపోయారు. కర్ణాటకలోని హంపిలో జమున జన్మించారు. తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి. తండ్రి వ్యాపార రీత్యా.. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. ఆమె తొలిచిత్రం పుట్టిల్లు.
Also Read: పెళ్లి తరువాత ప్రేమ తగ్గిపోయిందా..? అయితే ఇలా చేయండి..!!
రామారావు, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రల్లో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం సత్యభామ క్యారెక్టరే. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేమన్నట్టుగా జీవించారు జమున. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. తర్వాత అంచలంచలెగా ఎదిగి 198 సినిమాల్లో నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు జమున.

దక్షిణాది భాషలన్నంటితో పాటు.. పలు హిందీ సినిమాల్లోనూ నటించారు. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారామె. 1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నా, 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు.
