SS Rajamouli : విశ్వ వేదికపై చిత్రపతి..!!
హిట్టు మీద హిట్టు కొట్టిన మగధీర.. అనుకున్న రేంజి వచ్చేదాకా రాజీ పడని విక్రమార్కుడు. ఎంత బడ్జెట్ కైనా సై అంటే సై అనే సింహాద్రి. దర్శకేంద్రుడి స్టూడెంట్ నం.1.
ఆయన దర్శక ప్రజ్ఞ తో ఈగ కూడ ఎక్కగలదు వెండి తెరపై అందలం. దృశ్యాన్ని జక్కన శిల్పంలా చెక్కగల నైపుణ్యం అయనలో పదిలం . తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వ వేదికపై ఆవిష్కరించి మర్యాదను దక్కించుకున్న జక్కన . వైవిధ్య దర్శకత్వం ఆయన బాహుబలం.
అంతర్జాతీయ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్’ మరోసారి సత్తా చాటింది. గ్లోబల్ లెవల్‌లో ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న ఈ సినిమా తాజాగా మరో ప్రతిష్ఠాత్మక అవార్డును తన ఖాతాలో వేసుకుంది. విశేషంగా భావించే ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అవార్డుల్లో ఈ చిత్రం ఏకంగా ఐదింటిని సొంతం చేసుకుంది. బెస్ట్ యాక్షన్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఇంటర్నేషనల్ సాంగ్‌తోపాటు స్పాట్ లైట్ అవార్డును కూడా అందుకున్నారు రాజమౌళి అండ్ టీమ్.
‘ది వుమెన్ కింగ్’, ‘ది బ్యాట్ మ్యాన్’ వంటి విదేశీ చిత్రాలను వెనక్కి నెట్టి మన సినిమా విజయాన్ని అందుకుంది. భారతీయ సినిమా ఖ్యాతిని మరింత పెంచింది. చిత్రం కోసం పనిచేసిన ప్రతిఒక్కరికి ఈ ఆవార్డు అంకితం చిత్రయూనిట్ మెత్తం అకుఠిత దీక్షతో విసుగు విరామం లేకుండా ఖచ్చితమైన ఫలితం వచ్చేవరకూ చేసిన శ్రమకి దక్కిన అమూల్య ప్రతిఫలం అని చెప్పడం అయన వినమ్రతకు దర్పణం. నా చిత్రానికే కాదు మా భారతీయ చిత్రపరిశ్రమకు దక్కిన గౌరవం. మేరా భారత్ మహాన్. జై హింద్’ నినదించినప్పుడు విశ్వ భారతీయం గర్వపడింది..
నిను మోసే భాగ్యం కలిగిందనుకుంటూ..నీ మాతృ భూమి పొంగితే…
నీ సినీలోకంలో అదో పండగ అయిపోదా..!!
– శ్రీధర్ వాడవల్లి – హైదరాబాదు