War2 Trailer: నేనో ఆయుధాన్ని, ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని.. పవర్‌ఫుల్‌గా ‘వార్ 2’ ట్రైలర్
War2 Trailer: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ ట్రైలర్ వచ్చేసింది. యాక్షన్ ప్రియులు, సినీ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
‘వార్ 2’ ట్రైలర్ ప్రారంభం నుంచే భారీ యాక్షన్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఆకట్టుకుంది. హృతిక్ రోషన్ వాయిస్‌ఓవర్‌తో “నేను ప్రమాణం చేస్తున్నాను, నా పేరుని, గుర్తింపుని, నా ఇంటిని, కుటుంబాన్ని అన్నింటినీ వదిలేసి ఒక నీడలా ఉండిపోతాను” అంటూ తన పాత్ర యొక్క తీవ్రతను తెలియజేశారు. దేశం కోసం అజ్ఞాతంలో ఉండి పోరాడే ఒక వీరుడి పాత్రలో హృతిక్ కనిపిస్తున్నాడు.
ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని చేసి చూపిస్తాను..
ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేస్తూ, “నేను మాట ఇస్తున్నాను, ఎవరూ చేయలేని పనుల్ని, ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను చేసి చూపిస్తాను” అంటూ చెప్పే డైలాగులు అభిమానులను ఆకట్టుకున్నాయి. వీరిద్దరి మధ్య జరిగే పోరాటం, ఒకరికొకరు తలపడే సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి.
ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు..
ట్రైలర్లో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం, ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ముఖ్యంగా విమానాలపై చేసే యాక్షన్ స్టంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. కియారా అద్వానీ ఈ చిత్రంలో కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, యాక్షన్ సన్నివేశాల్లోనూ తన సత్తా చాటింది.
సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది, నిర్మాణ విలువలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉన్నాయని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డీసెంట్‌గా ఉన్నప్పటికీ, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా, ‘వార్ 2’ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. యాక్షన్ మూవీ లవర్స్, ఎన్టీఆర్, హృతిక్ అభిమానులు ఆగస్టు 14న థియేటర్లలో ‘అల్టిమేట్ వార్’ను చూడటానికి సిద్ధంగా ఉండొచ్చు.
