Loan on PAN Card: మీకు తెలీకుండా మీ పేరుపై మరెవరైనా లోన్ తీసుకున్నారా..?
Loan on PAN Card: డిజిటల్ మోసాలు నానాటికీ పెరిగిపోతున్న తరుణంలో, మీ పాన్ (PAN) వివరాలను ఉపయోగించి ఎవరైనా లోన్లు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి మోసాలు మీ క్రెడిట్ స్కోర్ (Credit Score) మరియు రుణ సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి, మీ పేరుపై ఏమైనా అనుమానాస్పద రుణాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం అత్యవసరం.
ముందుగా, మీ క్రెడిట్ రిపోర్ట్ (Credit Report) ను పరిశీలించాలి. సిబిల్ (CIBIL), ఈక్విఫాక్స్ (Equifax), ఎక్స్పీరియన్ (Experian) వంటి క్రెడిట్ బ్యూరోలు మీ పాన్ ఆధారంగా ఈ రిపోర్ట్‌ను జారీ చేస్తాయి. ఇందులో మీరు తీసుకున్న లోన్లు, క్రెడిట్ కార్డు లావాదేవీల సమాచారం స్పష్టంగా ఉంటుంది. మీ పేరు మీద లోన్ లేకపోయినా, మీ పాన్ నంబర్ దుర్వినియోగానికి గురై ఉండే అవకాశం ఉంది. క్రెడిట్ రిపోర్టులో కనిపించే ‘హార్డ్ ఎంక్వైరీ’ (Hard Enquiry) లను గమనించండి. అనుమానాస్పద సంస్థల నుంచి వచ్చిన ఎంక్వైరీలు కనిపిస్తే, వెంటనే ఆ బ్యూరోకు ఫిర్యాదు చేయండి. హార్డ్ ఎంక్వైరీలు కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
లిఖితపూర్వక ఫిర్యాదు తప్పనిసరి
మీ పేరుపై ఏదైనా అనుమానాస్పద రుణం ఉన్నట్లు గుర్తించినట్లయితే, వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించి లిఖితపూర్వక ఫిర్యాదు (Written Complaint) ఇవ్వండి. లోన్ మీకు సంబంధించింది కాదని స్పష్టంగా తెలియజేసి, రశీదు (Acknowledgment) తీసుకోవడం ముఖ్యం. అనంతరం, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయండి. ఇది మోసం జరిగిందని అధికారికంగా నమోదు చేయడానికి, తదుపరి చట్టపరమైన చర్యలకు ఉపయోగపడుతుంది. అలాగే, రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్‌మన్ (Reserve Bank Ombudsman) కు కూడా ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
బలమైన పాస్వర్డ్లు ఉపయోగించండి..
పాన్ దుర్వినియోగాన్ని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పాన్, ఆధార్ వివరాలను ఎవరికి పడితే వారికి వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేయవద్దు. అనధికారిక వెబ్సైట్లలో లేదా అనుమానాస్పద రిటైలర్లకు మీ పాన్ వివరాలను అప్లోడ్ చేయడం లేదా ఇవ్వడం మానుకోండి. మీ పాన్ కార్డ్ పోయినట్లయితే, వెంటనే డూప్లికేట్ కోసం దరఖాస్తు చేయండి. బ్యాంకింగ్ యాప్‌లు మరియు లోన్ అప్లికేషన్లకు బలమైన పాస్వర్డ్లు (Strong Passwords) ఉపయోగించండి. టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2-Factor Authentication) మరియు ఎస్ఎంఎస్/ఇ-మెయిల్ నోటిఫికేషన్లు (SMS/Email Notifications) ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా భద్రతను మరింత పెంచుకోవచ్చు