Delete Old Emails: ఓల్డ్ ఈ-మెయిల్స్ డిలీట్ చేసి వాటర్ సేవ్ చేయండి..!
Delete Old Emails: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) కూడా ఇప్పుడు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి యూకే ప్రభుత్వం ప్రజలకు ఒక వినూత్నమైన సూచన చేసింది. తమ ఇన్‌బాక్స్‌లలోని పాత, అనవసరమైన ఈ-మెయిల్స్‌ను, ఫొటోలను డిలీట్ చేయాలని ప్రజలను కోరింది. ఇది వినడానికి వింతగా ఉన్నా, దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది.
క్లౌడ్ స్టోరేజ్, డేటా సెంటర్లు భారీగా నీటిని వినియోగిస్తాయి. మన పాత ఈ-మెయిల్స్, ఫొటోలు, ఇతర డేటా అంతా ఈ డేటా సెంటర్లలోనే నిల్వ ఉంటుంది. ఈ డేటా సెంటర్లలోని సర్వర్‌లను చల్లబరచడానికి భారీ మొత్తంలో నీరు అవసరం. ఒక్కో పెద్ద డేటా సెంటర్ రోజుకు ఏకంగా 50 లక్షల గ్యాలన్ల నీటిని వాడుకుంటుంది. ఇది సుమారు 10,000 నుంచి 50,000 మంది ప్రజలున్న ఒక పట్టణానికి సరిపోతుంది. ఈ నేపథ్యంలో, అనవసరమైన డేటాను డిలీట్ చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం సూచించింది.
ప్రస్తుతం యూకేలో నాలుగో హీట్‌వేవ్ నడుస్తోంది. ఇంగ్లాండ్‌లోని ఐదు ప్రాంతాలను అధికారికంగా కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. మరో ఆరు ప్రాంతాల్లో తీవ్రమైన పొడి వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితిలో నీటిని పొదుపు చేయడం చాలా అవసరమని ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ హెలెన్ స్పష్టం చేశారు. ఈ కరవును ఎదుర్కోవడానికి ప్రభుత్వం మరికొన్ని సూచనలు కూడా చేసింది. వర్షపు నీటిని సేకరించడం, టాయిలెట్లు, వాష్‌రూమ్‌లలో లీకేజీలను సరిచేయడం, వంటగదిలో వాడిన నీటిని మొక్కలకు ఉపయోగించడం, షవర్ కింద తక్కువ సమయం గడపడం వంటివి పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ చర్యల ద్వారా దేశం ఈ కష్టకాలాన్ని అధిగమించాలని యూకే ప్రభుత్వం ఆశిస్తోంది.
గార్డెన్‌కు వాడుకోవడానికి వీలుగా వర్షపు నీటిని సేకరించే రెయిన్ బట్‌లు ఏర్పాటు చేసుకోవాలని యూకే సూచించింది. టాయిలెట్లు, వాష్‌రూముల్లో లీకేజీలను సరిచేసుకోవడం వల్ల రోజుకు 200-400 లీటర్ల నీటిని పొదుపు చేసుకోవచ్చని యూకే ప్రభుత్వం తమ పౌరులకు విజ్ఞప్తి చేస్తోంది. అలాగే బ్రష్ లేదా షేవింగ్ చేసుకునే సమయంలో ట్యాప్ వాటర్‌ను ఆపేయాలంటూ వాటర్ సేవింగ్స్ టిప్స్‌ను పౌరులకు అందించింది.