Ap MLC Elections Result : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా శ్రీకాకుళం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో విజయఢంకా మోగించింది. శ్రీకాకుళం జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి నక్తు రామారావు విజయం సాధించగా, ప.గో.జిల్లాల్లో కవురు శ్రీనివాస్ 481,వంక రవీంద్ర 460 ఓట్లు సాధించడంతో ఆ పార్టీ ఆనందోత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ గురువారం ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు.
ఈనెల 13న ఏపీలోని మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, రెండు ఉపాధ్యాయ స్థానాలతో పాటు తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 752 మంది స్థానిక ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో రామారావుకు 632 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆనేపు రామకృష్ణకు 108 ఓట్లు రాగా అందులో 12 ఓట్లు చెల్లలేదు.
ముందుగా స్థానిక సంస్థల కోట ఎన్నికల ఫలితాలు విడుదల చేశారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు భారీ సంఖ్యలో ఉండడంతో తుది ఫలితాల విడుదల ఆలస్యం కానుంది. అయితే ఇది ఇలా ఉండగా.. వైకాపా విజయం దిశగా దూసుకుపోడానికి అసలు కారణం, ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటర్లను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకోవడమే ఈ గెలుపుకు కారణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.