Delhi Liquor Scam Case : మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఈడి ముందు విచారణకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. కవిత నిర్ణయం తో ఇప్పటికే Cm నివాసం ముందు కార్యకర్తలు, అభిమానులు జమ కూడుతుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఢిల్లీలోని సీఎం నివాసం నుండి ఉదయం 10:30 కు ఈడి ఆఫీస్ కి కవిత బయలుదేరనున్నారు. 11 గంటలకు విచారణ మొదలు కానుంది. కవితతో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా వెళ్లే అవకాశం ఉంది. మార్చి 11న తొలిసారి ఈడి ముందు విచారణ హాజరైన ఎమ్మెల్సీ కవిత, ఈరోజు రెండోసారి విచారణకు హాజరవుతున్నారు.
ఇదివరకు ప్రత్యామ్నాయంగా తన లాయర్ ని పంపించి ఈడీ విచారణ నుండి ఊరట పొందాలి అనుకున్న కవిత కు, ఈడీ మాత్రం స్పష్టంగా వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో కవిత ఎన్నో చర్చల తర్వాత రెండోసారి విచారకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటినుండి కూడా విచారణ కు వెళ్ళడానికి ససేమిరా అంటున్న కవిత.. ఒక మహిళగా తనను ఎలా ఈడి విచారణకు పిలుస్తుంది అని తప్పు పడుతూ, ఈ నెల 16న సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టు లో కూడా చుక్కెదురు కావడంతో హైడ్రామా మధ్యలో ఎట్టకేలకు ఈడి ముందు హాజరు కావడానికి ఒప్పుకుంది కవిత. ఇది ఇలా ఉండగా స్కామ్ లో అరెస్టు అయిన రామచంద్ర పిళ్లై కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే రామచంద్ర పిళ్లైతో పాటు కవితను కలిపి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం. ఈడీ విచారణకు ఈరోజు కవిత హాజరు అవుతుండటంతో మద్యం కుంభకోణం కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది.