Pawan Kalyan: కాకినాడ స్వాతంత్ర్య వేడుకల్లో జెండా ఎగురవేసిన పవన్ కళ్యాణ్..!
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
విదేశీ కుట్రల గురించి పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో దేశంపై కొన్ని విదేశీ శక్తులు కుట్రలు పన్నేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దేశ అంతర్గత శత్రువులు ఈ విదేశీ శక్తుల కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. “గత ప్రభుత్వంలో రాష్ట్రంలో చీకటి రోజులు ఉన్నాయి. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితోనే మేము ఆ ప్రభుత్వంపై పోరాడాం” అని పవన్ పేర్కొన్నారు.
అధికార కూటమి గురించి మాట్లాడుతూ, “పదవుల్లో ఉండి ఎంజాయ్ చేయాలనేది మా ఉద్దేశం కాదు. రాష్ట్రంలో సుస్థిరమైన పాలన ఉండాలంటే కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్లు ఉండాలి” అని ఆయన అభిలషించారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన పార్టీలు ఈవీఎంలపై చేస్తున్న ఆరోపణలను పవన్ ఖండించారు. “వారు గెలిస్తే ప్రజాతీర్పు అంటారు, మేము గెలిస్తే ఈవీఎంల తప్పా?” అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా ఎద్దేవా చేశారు.
రాష్ట్ర అభివృద్ధి, భద్రతపై..
రాష్ట్ర అభివృద్ధి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రస్తుతం రూ.7,900 కోట్లతో ఐదు జిల్లాల్లో జల్‌జీవన్ మిషన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో కేవలం ఐదు నెలల్లోనే రూ.380 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్ర భద్రత విషయంలో పవన్ కళ్యాణ్ కీలక హెచ్చరికలు చేశారు. కాకినాడ తీర ప్రాంతంలో డీజిల్ అక్రమ రవాణా జరుగుతోందని, దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే భవిష్యత్తులో ఆయుధాలు, బాంబులు అక్రమంగా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తీర ప్రాంతంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కూడా పాల్గొన్నారు.