Janasena Chief Pawan Kalyan : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాహి విజయయాత్ర విజయవంతమైన సందర్భంగా, పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర సాగిన నియోజకవర్గాల ఇంచార్జులు, పరిశీలకులతో శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయి పేరు,పేరునా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక అంశాలపైన ప్రస్తావించారు.
వారాహి విజయయాత్ర కంటే ముందు పొత్తుల విషయమై పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఎలా ఉన్నా.. వారాహియాత్ర తర్వాత ఆయన ఒక స్పష్టమైన అవగాహతో ఉన్నారు. ప్రజల సమస్యలు, ప్రజల ఆదరాభిమానాలు చూసిన తర్వాత పొత్తుల విషయమై ఆలోచించడానికి ఇంకా సమయం ఉందని, బలంగా పనిచేస్తే అధికారం దానంతట అదే వరిస్తుంది. ఎన్నికల్లో పోటీకి ఒంటరిగా వెళ్లాలా, కలిసి వెళ్లాలా అనే విషయంపై సమగ్ర అధ్యయనం తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
రెండో దశ వారహియాత్ర మొదలు కాబోతున్న సందర్భంగా ఆయన నాయకులకు దిశా, నిర్దేశం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని అనుభవాలతో జనసేన పార్టీ ప్రజల్లో బలాన్ని పుంజుకోవడానికి అడుగులు వేస్తుందని, పార్టీ ప్రజల మధ్యలోనే ఉందని చెప్పడానికి నిదర్శనమే యాత్రకు తరలివస్తున్న జన సమూహం. ప్రజలకు సమస్యలను తీర్చే నాయకులే కావాలి, దానికి జనసేన పార్టీ ఒకటే సమర్థవంతమైందని ప్రజలు నమ్ముతున్నారు. ప్రజల విశ్వాసం మనం చూరగోన్నాము.
ఆ పునాదులని ఆసరాగా చేసుకుని ప్రజల సమస్యల కొరకు మనం మరింత కృషి చేయాలని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వైసీపీ పాలన విధానాన్ని పవన్ కళ్యాణ్ ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్ లో “రూల్ ఆఫ్ లా” వైసీపీ నాశనం చేస్తుందని, ఏ పార్టీ అయినా కూడా రూల్ ఆఫ్ లా కట్టుబడి పని చేయాలి కానీ ఆ నిబద్ధత వైసిపికి లేదని, వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ అనే నినాదాన్ని జనసేన పార్టీ నుండి ఊరికే ఇవ్వలేదని దాని వెనకాల చాలా స్పష్టమైన అవగాహన మాకు ఉందని పవన్ వెల్లడిస్తూ, ఒక నాయకత్వంలో
ప్రజల మనుగడ ఎలా ఉందని తెలుసుకోవడానికి ఎక్కువ రోజులు అవసరం లేదు. అధికారం చేతిలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే వైసీపీ బండారం బయటపడి పోయింది. జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు వెళుతున్న మార్గం తప్పుడు మార్గం. అవినీతి పాలనలో ప్రజలు బతుకుతున్నారు అనడానికి ఈరోజు మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వస్తున్న విశేష స్పందననే నిదర్శనం. వైసిపి పాలన రీతిని అదే స్పష్టం చేస్తుంది.
70 శాతం ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో గంజాయి విక్రయాలు తారాస్థాయికి చేరాయి. 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారు. ఇలాంటి పెద్ద సమస్యల పైన కూడా ముఖ్యమంత్రి స్పందన కరువైంది. ఇక సామాన్య ప్రజానీకానికి ఎలాంటి మేలు చేస్తాడో మనం ఆలోచించవచ్చు. వైసీపీ పాలన నుంచి ప్రజలను కాపాడుకొని రాష్ట్రంలో స్థిరత్వ పాలన తీసుకురావడమే జనసేన లక్ష్యం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.