Janasena Party : జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయడం కొరకు మరో అడుగు ముందుకు వేశారు. పవన్ కళ్యాణ్ సోదరుడు “శ్రీ కొణిదెల నాగబాబు గారిని” పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసారు.
ప్రస్తుతం నాగబాబు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యునిగా ఉంటూ, పార్టీకి తన సేవలను అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి పదవితో నాగబాబు మీద మరిన్ని కీలక బాధ్యతలు పెరగనున్నాయి. జనసేన పార్టీకి విదేశాలలో కూడా ప్రతినిధులు, అభిమానులు ఉన్నారు.
ఎన్ఆర్ఐ సేవలను పార్టీకి సమర్థవంతంగా ఉపయోగపడేలా వారిని ఇకమీదట నాగబాబు సమన్వయ పరచ నున్నారు. నాగబాబు తో పాటు నెల్లూరు వాస్తవ్యులు, ఉన్నత విద్యావంతులైన “వేములపాటి అజయ్ కుమార్” గారికి పార్టీకి సంబంధించిన కొన్ని ముఖ్య బాధ్యతలు పవన్ కళ్యాణ్ అప్పగించారు.
అజయ్ కుమార్ ఇన్ని రోజులు పార్టీకి పరోక్షంగా సేవలు అందించారు. ఇక మీదట ప్రత్యక్ష సేవలను అందించనున్నారు. అజయ్ విద్యార్థి నాయకునిగా ఓయూలో తనదైన ముద్రవేశారు. నెల్లూరులో తన డిగ్రీనీ పూర్తి చేసిన అజయ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు. అజయ్ ది ముందు నుండే రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కావడం గమనార్హం.
అజయ్ కి వివిధ రంగాల్లో ప్రవేశం ఉంది. ముఖ్యంగా మానవ వనరుల అభివృద్ధిలో అజయ్ కి మంచి పరిజ్ఞానం ఉంది. నాగబాబు ,అజయ్ ల కీలక బాధ్యతలతో, వారి సేవలతో జనసేన పార్టీ విజయవంతంగా ముందుకు వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ వారి ఇరువురికి అభినందనలు తెలిపారు.