KTR Tweet Viral On X : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పొంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అపజయం వెనుక చాలా రకాల కారణాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలు వల్లనే ప్రజల నుండి మద్దతు కోల్పోవడానికి ముఖ్య పీటిక అయిందని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందిస్తూ.. కేసీఆర్ ని కోల్పోవడం తెలంగాణ ప్రజలు చేసుకున్న పెద్ద దురదృష్టంగా అభివర్ణించారు. కేసీఆర్ ప్రజలందరి బాగుకోసం ఎంతో శ్రమించారని, రైతుల కోసం ఆలోచించారని, ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, ప్రాజెక్టుల రూపంలో ప్రజల అభివృద్ధిని కలలుగన్నారని నాయకులు మీడియా ముఖంగా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేశారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి వెళితే..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను “X” వేదికగా ట్వీట్ చేశారు. దాంట్లో ఆయన అభిప్రాయం ప్రకారం.. “ఎన్నికల ఫలితాల తర్వాత నాకు చాలా ఆసక్తికరమైన ఫీడ్ బ్యాక్, పరిశీలనను వస్తున్నాయి, కేసీఆర్ 32 ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఉంటే ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే వాళ్ళమని,” ఆయన ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ, ఎక్కడికి అక్కడ బీఆర్ఎస్ ఎటువంటి అభివృద్ధి చేయలేదని, అసత్య ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, దాంట్లో భాగంగానే సోషల్ మీడియాను కాంగ్రెస్ పార్టీ వాళ్లు విస్తృతంగా వాడుకున్నారని, సోషల్ మీడియా ముఖంగా ప్రజలను తప్పుదోవ పట్టించారని స్పష్టం చేశారు.
ఇప్పుడు కేటీఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ శ్రేణులు సైతం మద్దతు తెలిపారు. ఇది ఇలా ఉంటే మరికొందరు మాత్రం, అభివృద్ధి కళ్ళకు కనిపిస్తే ప్రజలే నిర్ణయిస్తారు. కానీ ప్రజల తీర్పు ఈసారి కాంగ్రెస్ వైపు ఉంది. కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని విమర్శిస్తున్నారు.