Nadendla Manohar : జననసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భీమవరంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ..సమయం సందర్భం లేకుండా ప్రతిపక్షాలపైన నోటికొచ్చినట్లు మాట్లాడే ముఖ్యమంత్రి ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం, పాఠశాలల్లో చదివే పిల్లలకు సంబందించిన కార్యక్రమంలో ఏ మాట్లాడాలో కూడా తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడటం ముఖ్యమంత్రికి చెల్లింది.
అసలు ప్రజాధనంతో నిర్వహించే ప్రభుత్వం కార్యక్రమాన్ని రాజకీయ విమర్శలకు వాడుకోకూడదన్న ఇంగితం కూడా తెలియకపోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. పిల్లలకు ప్రభుత్వం ఏ చేయబోతుందో చెబుతూ, తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి హోదాలో సందేశం ఇవ్వవలసిన జగన్ రెడ్డి దాన్ని మర్చిపోయారు. నాడు-నేడు అని గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి సంస్కారం మరిచి మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ గారు లారీల్లో తిరిగితే మీకేంటి..? ఆయన నిత్యం ప్రజల్లోనే తిరుగుతున్నారు. మీరు మాత్రం ప్రజా సమస్యలను గాలికి వదిలి నిత్యం హెలికాప్టర్ లో తిరుగుతున్నారు. రూ.5 కోట్లతో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలకు ఉపయోగించుకోవడం వైసీపీ ప్రభుత్వ పాలన తీరుకు నిదర్శనం. ఈ ముఖ్యమంత్రికి ఏ మాత్రం రాష్ట్రంపై ప్రేమ ఉన్నా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద, ప్రజలకు అందాల్సిన సుపరిపాలన మీద మాట్లాడాలి.
దాన్ని వదిలేసి పూర్తిగా హోదా మరచి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ వైసీపీ పాలనను తరమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వైసీపీకి 2024 చివరి ఎన్నికలు. ప్రజలను సంక్షేమం అనే భ్రమలో పెట్టి, రాష్ట్రంలో గంజాయిని బహిరంగ వ్యాపారం చేశారు. ఇసుక, గంజాయి మాఫియాలో వైసీపీ నాయకులు కూరుకుపోయారు. వాటిని ఎలా నిరోధించాలనే అంశాలను మాట్లాడాల్సిన సీఎం కేవలం పవన్ కళ్యాణ్ సభలకు వస్తున్న స్పందన చూసి మతి చలించి మాట్లాడుతున్నట్లుగా ఉంది.
పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ పాలసీలు, పని తీరు, ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు, వ్యవస్థల్లోని లోపాల గురించి బహిరంగ సభల్లో మాట్లాడుతుంటే, వాటికి సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేయడం దిగజారుడుతనమే. ముఖ్యమంత్రి హోదాను మరచి పవన్ కళ్యాణ్ గారిపై వ్యాఖ్యలు చేయడం దారుణం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా వ్యవహరించాలో కూడా తెలియని వ్యక్తులు ఆ స్థానంలో కూర్చున్నందుకు సిగ్గుపడాలి అన్నారు.