Pawan kalyan – Janasena : ఈరోజు మహాత్ముడు జ్యోతిరావు పూలే జయంతి. ఆయన జన్మదిన వేడుకలను పురస్కరించుకొని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జ్యోతిబాపూలే సేవలను కొనియాడాడు. భారతదేశంలో జ్యోతిరావు పూలే అణచివేతకు, అంటరానితనానికి వ్యతిరేకంగా తన తోటి ప్రజల కోసం ఎన్నో అవమానాలను ధైర్యంగా ఎదుర్కొని ప్రజల కోసం నిలబడ్డాడు. సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగిపోవాలని అందరూ సమానమని చాటి చెప్పడానికి ఆయన ఎంచుకున్న పోరాట బాట స్ఫూర్తిదాయకం.
పూలే ఒక చైతన్య మూర్తి, తాను కలలుగన్న సమాజం కోసం, విద్యాబుద్ధులు నేర్పించడానికి తన తోటి ప్రజలను చైతన్యపరచడంలో ఎన్నో అవరోధాలు ఎదురైనా కూడా వెనక వేయకుండా అణచివేతకు, అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడిన సంఘసంస్కర్త. అణగారిన ప్రజల కోసం, వారి విద్య, అభివృద్ధి కోసం, వితంతు మహిళల కోసం, మహిళా సాధికారత కొరకు, ప్రజాస్వామ్యం కొరకు, సమ సమాజ నిర్మాణం కొరకు ఆయన ఎంపిక బాట అనిర్వచనీయమైనది, అది మనకు ఒక మార్గదర్శనం.
ఆ బాటలోనే మనమందరం కూడా నడవాలి. జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటైన కులాలను కలిపే ఆలోచనా విధానం పూలే ఆలోచనలకు దగ్గరగా ఉండే సూత్రం అని ఆ మహాత్ముని ఆశయాల సాధనలోనే జనసేన పార్టీ పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. వాడవాడలా పూలే జయంతిని ఘనంగా నిర్వహించి పూలమాలలతో సత్కరించి ఆయన ఆశయాల దీక్షను ప్రతి ఒక్కరు అందుకోవాలని తమ పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ సూచించారు.