Pawan Kalyan vs YS Jagan : ఆడ బిడ్డలకు రక్షణ ఉందా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న..
* సి.ఎం. నివాసానికి సమీపంలో ఘాతుకాలు చోటు చేసుకొంటున్నా మౌనమే..
* తాడేపల్లిలో అంధ యువతి హత్య కచ్చితంగా శాంతిభద్రతల వైఫల్యమే..
వైసీపీ ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసానికి సమీపంలో అంధ యువతి హత్యకు గురైన ఘటన కలచివేసింది అన్నారు పవన్ కళ్యాణ్. కంటి చూపునకు నోచుకోని ఆ యువతిని వేధింపులకు గురి చేసి కిరాతకంగా నరికి చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలి అని ఆయన డిమాండ్ చేశారు.

జగన్ కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే..!!
గంజాయి మత్తులో సదరు వ్యక్తి నేరానికి ఒడిగట్టాడని, గతంలోనూ పోలీసులపైనా, మహిళలపైన దాడులకు తెగబడ్డాడని పోలీసులు చెబుతున్నారు. ఈ హత్య ఘటనను శాంతిభద్రతల వైఫల్యంగా చూడాలి. ముఖ్యమంత్రి ఇంటి పరిసరాల్లో పటిష్టమైన పోలీసు పహారా, నిఘా వ్యవస్థలు పని చేస్తాయి. అయినా తాడేపల్లి ప్రాంతం అసాంఘిక శక్తులకు, గంజాయికీ అడ్డాగా మారింది. అంటే లోపం ఎక్కడ ఉంది? అని పవన్ ధ్వజమెత్తారు. ఏడాదిన్నర క్రితం ఆ ప్రాంతంలోనే ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుల్లో ఒకర్ని ఇప్పటికీ పట్టుకోలేకపోయారంటే వైఫల్యం ఎవరిదీ? తన నివాసం పరిసరాల్లో పరిస్థితులనే సమీక్షించకుండా మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటే అని ఎద్దేవా చేశారు. పోలీసు శాఖకు అవార్డులు వచ్చాయి, దిశా చట్టం చేశామని చెప్పుకోవడమే తప్ప రాష్ట్రంలో ఆడబిడ్డలకు మాత్రం రక్షణ లేకుండాపోయింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు ఉన్నతాధికారులే పటిష్ట చర్యలు తీసుకోవాలి అని పవన్ తెలిపారు.
అన్ని వర్గాలూ ఆలోచన చేయాలి..
అత్యాచారాలు చోటు చేసుకొంటున్నాయి అంటే తల్లి పెంపకంలోనే లోపం ఉంది, ఏదో దొంగతనానికి వచ్చి రేప్ చేశారు అంటూ వ్యాఖ్యానించే మంత్రులు ఉన్న ప్రభుత్వం ఇది. ఆడపడుచులపై అఘాయిత్యాలు సాగుతున్నా మహిళా కమిషన్ ఏం చేస్తోంది? పదవులు ఇచ్చినవారిని మెప్పించేందుకు రాజకీయపరమైన ప్రకటనలు, నోటీసులు ఇస్తే మహిళలకు రక్షణ, భరోసా దక్కవని గుర్తించాలి.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైంది. గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ను మార్చేశారు. శాంతిభద్రతల వైఫల్యం, ఆడ బిడ్డలపై అఘాయిత్యాలపై మహిళా సంఘాలు, మేధావులు, న్యాయ నిపుణులు గళమెత్తాలి అని పవన్ పిలుపు ఇచ్చారు..
