Varahi VijayaYathra : వారాహి విజయయాత్రలో అమలాపురం బహిరంగసభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ. అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి… జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి. “హాలో ఏపీ..బైబై వైసీపీ” ఇదే జనసిన ఎన్నికల నినాదం కావాలని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. బహిరంగ సభ వేదిక నుంచి అందరితో నినాదాన్ని చేయించారు.
వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం అమలాపురం గడియార స్తంభం కూడలిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన అశేష జనవాహిని ‘వాల్లో ఏపీ… బైబై వైసీపీ’ అని నినదిస్తుంటే అమలాపురం దద్దరిల్లింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత క్రైమ్ రేటు పెరిగిపోయింది. అక్కను వేధించొద్దు అన్న పాపానికి బాపట్లలో 14 ఏళ్ల బాలుడిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతుంది.
తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. మనల్ని పాలించే నాయకులు బాధ్యతగా లేకపోవడం వల్లే ఈ రోజు రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొంది. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్యను కవర్ చేయడానికి ముందు గుండెపోటు నాటకం ఆడారు. తరువాత విషయం బయటకు పొక్కడంతో ఎవరో చంపారని చెప్పారు. నిజం బయటకొస్తుందనే భయంతో ఒక వ్యక్తిని చంపేశారు. విచారణ చేయడానికి వచ్చిన సీబీఐ అధికారులను బెదిరించారు.
హత్యకు సంబంధించిన కీలక వ్యక్తిని అరెస్టు చేద్దాం అంటే అడ్డుకున్నారు. కోనసీమ అల్లర్ల కేసులో ఆభంశుభం తెలియని 250 మంది యువకులపై కేసులు పెట్టడానికి బలంగా పనిచేసిన చట్టాలు చిన్నాన్నను చంపిన వాళ్లను పట్టుకోవడంలో మాత్రం పనిచేయలేదు. ఇలాంటి ప్రభుత్వాలా మనకు కావాల్సింది?..విదేశీ విద్యాపథకానికి అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకొన్నారు.మద్యం పేరుతో విషం అమ్ముతుంది వైసీపీ ప్రభుత్వం.
ఆడబిడ్డల తాళిబొట్లు తెంపేస్తుంది ఈ ప్రభుత్వం. ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు తీరని ద్రోహం చేశాడు.జనసేన ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల హెల్త్ ఇన్సూరెన్సు వచ్చేలా చూస్తాము. రైతాంగానికి సంపూర్ణ మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంటాము. కోనసీమ ప్రజల కల నెరవేర్చేలా కోస్తా రైలు మార్గం సాధించేలా కృషి చేస్తాం.అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.