Varahi VijayaYathra : వారాహి విజయయాత్రలో భాగంగా మంగళవారం కాకినాడలో ముస్లిం ప్రతినిధులతో సమావేశమైన పవన్ కళ్యాణ్. ఎవరు ఏ మతాన్ని నమ్మినా, ఏ దేవుడిని పూజించినా ఎవరికీ ఇబ్బంది లేదు. కేవలం రాజకీయాల కోసం మతాన్ని వాడుకునే వారితోనే అందరికీ ఇబ్బంది అని జనసేన పార్టీ అధ్యకులు పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.
భారతదేశంలో ముస్లింలు ఏనాటికీ మైనార్టీలు కాదు. ఈ దేశం మనందరిది అన్నారు. ముస్లింల భద్రం, గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా జనసేన పార్టీ చూసుకుంటుందని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా, ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
భారత దేశంలో సమాజం పేరు, రాజకీయ పార్టీలు వేరు. మైనార్టీలు అనగానే సంపూర్ణంగా అవకాశాలు ఉండవనే భావన మొదట మీ మనసులో నుంచి తొలగించండి. భారతదేశం కులాల సమాజం. ఒక్క దళితుల్లోనే 14 రకాల ఉప కులాలు ఉన్నాయి అని ఆయన వెల్లడించారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు మఠాలు, మత ఘర్షణలపై చాలా అధ్యయనం చేశాను.
మత ప్రాతిపదిక భారతదేశం, పాకిస్థాన్ రెండు దేశాలుగా విడిపోవడం వరకు కుణ్ణంగా తెలుసుకున్నాను. మహమ్మద్ అలీ జిన్నా గారి హిందు, ముస్లింలు కలిసి ఉండలేరు.ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని పెట్టిన ప్రతిపాదన మేరకు దేశ విభజన జరిగింది. దేశ విభజన సమయంలో మంది ఆడపడుచులు ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో జరిగిన మత ఘర్షణల వల్ల దాదాపు రూ. 10 లక్షల మంది మరణించారు.
కొంతమంది హిందువులు పాకిస్థాన్ లో ఉండిపోతే ముస్లింలు కొంతమంది భారతదేశంలో ఉండిపోయారు. పాకిస్థాన్ లో హిందువులపై దాడులు జరుగుతాయి. బలవంతంగా మత మార్పిడిలు జరుగుతాయి. ఎదురు తిరిగితే చంపేస్తారు. ఇక్కడ మాత్రం ఒక ముస్లింకు అన్యాయం జరిగినా ఇంకో హిందువు అండగా నిలబడతాడు. ముస్లింలు కూడా మా సోదరులు అనుకోబట్టే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యారు. అజారుద్దీన్ భారత్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయ్యారు.
వ్యక్తుల్లో మంచి, చెడులు గురించి మాట్లాడుకోవాలి తప్పితే మతం గురించి కాదు. పూర్వం భారతదేశంలో ఇస్లాం మతం రాకమునుపు మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని శైవులు, వైష్ణవులు కొట్టుకున్నారు. ఏ మతంలోనైనా విపరీతవాదాన్ని అందరం ముక్త కంఠంతో ఖండించాలి అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.