Varahi VijayaYathra : కాకినాడ రూరల్, అర్బన్ నియోజక వర్గాల వీరమహిళల తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడబిడ్డ మళ్లీ క్షేమంగా ఇంటికి చేరాలి. తనకు ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా చెప్పుకోవాలి. తన హక్కుల కోసం గొంతెత్తాలి. అలాంటి సమాజ నిర్మాణ కోసమే జనసేన పార్టీ పోరాటం చేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
రాజకీయాలు అంటే వేలకోట్ల డబ్బు, నోటికొచ్చినట్లు బూతులు తిట్టడం, అరుపులు, కేకలుగా మారిపోయాయి. ఆ ఆలోచనను ప్రజల మనసు నుంచి మార్చాలనే జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది అన్నారు. ఒక సిద్ధాంతం కోసం మనం బలంగా నిలబడితే అది జరిగి తీరుతుందని తెలిపారు. వారాహి విజయయాత్రలో భాగంగా సోమవారం కాకినాడలో వీరమహిళలతో సమావేశమయ్యారు.
క్రిమినల్ పాలించడం అన్నా రాజ్యం ఏలినా నాకు చిరాకు, కులాలు, వర్గాలుగా మనల్ని విడగొట్టి వాళ్లు రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారు. ఎదురు తిరిగి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ వైసీపీ నాయకులు ఎంత నీచానికి దిగజారారు అంటే ఎస్సీల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు పెడుతున్నారు. బతికినంత కాలం వీళ్ల కాళ్ల దగ్గర అణిగిమణిగి ఉండాలని అనుకుంటున్నారు అని ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
ఈ ప్రభుత్వ హయాంలో ప్రజా ప్రతినిధుల కుటుంబానికే రక్షణ లేదు. బాపట్లలో 14 ఏళ్ల బాలుడు తన అక్కను వేధిస్తున్నాడని వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తిని నిలదీస్తే, ఆ వెంకటేశ్వరరెడ్డి ఆ బాలుడిని పెట్రోలు పోసి తగులబెట్టాడు. ఆ అబ్బాయిని చూస్తే నాకు నేను గుర్తొచ్చాను. చిన్నప్పుడు మా అక్కను కామెంట్ చేస్తుంటే నాకు వాళ్లను చంపేయాలన్నంత కోపం వచ్చింది.
విశాఖపట్నంలో సాక్షాత్తు ఓ ఎంపీ కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. డబ్బుల కోసం కిడ్నాప్ చేశారు. ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మన ఆంధ్ర ప్రాంతంలో అన్యాయం జరిగితే బయటకైనా వస్తుంది. అదే రాయలసీమలో అయితే గొంతెత్తే పరిస్థితి కూడా లేదు. ముందు మనం బలంగా ఉన్న ప్రాంతంలో పోరాటం చేయాలి. తరువాత దానంతట అదే విస్తరిస్తుంది అని సమావేశంలో మహిళలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు.