Varahi VijayaYathra : రాజోలు నియోజకవర్గం జయహో జనసేనాని అంటూ నినదించింది. వారాహి విజయ యాత్రతో మలికిపురం మండల ప్రజానీకం మొత్తం రహదారులపై బారులు తీరారు. దిండి నుంచి మలికిపురం బహిరంగ సభకు బయలుదేరిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రతి అడుగులో అపూర్వ స్వాగతం లభించింది. దిండి రిసార్ట్ నుంచి. అడుగడుగునా ఆడపడుచులు హారతులు పట్టగా,జన సైనికులు పూల వర్షంతో తడిసిముద్దయ్యారు.
దిండి, మేడిచర్లపాలెం, గుడిమెళ్లంక గ్రామాల్లో మహిళలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గుమ్మడి కాయలతో దిష్టి తీశారు. వారాహి విజయ యాత్రను చూసేందుకు మేడిచర్లపాలెం గ్రామస్తులు మొత్తం వయోబేధం లేకుండా రహదారికి ఇరువైపునా నిలబడి జనసేనానికి నీరాజనాలు పలికారు. దిండి రిసార్ట్ నుంచి వేలాది మంది జనసైనికులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా మలికిపురం వరకు అనుసరించారు.
దిండి, మలికిపురం మధ్య మార్గం మొత్తం జనసేనానికి కట్టిన స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. జనసేన నినాదం హల్లో ఏపీ..బైబై వైసీపీ నినాదంతో ఫ్లెక్సీలు, హోర్డింగులు నిండిపోయాయి. పవన్ కళ్యాణ్ పిలుపుతో మిగిలిన స్టార్ హీరోల అభిమానులు తమ మద్దతు తెలుపుతూ రోడ్డెక్కారు. మేము మహేష్ బాబు అభిమానులం,మా ఓటు జనసేనకు అంటూ కొంత మంది చేతుల్లో మినీ ప్లెక్సీలు దర్శనమిచ్చాయి.
జనసేన శ్రేణులు, జనసేనానికి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళల జయ జయధ్వనులతో రహదారులు దద్దరిల్లాయి. పవన్ కళ్యాణ్ మలికిపురం చేరగానే పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రాజోలు నియోజకవర్గ సమస్యలను వివరిస్తూ ప్రచురించిన కరపత్రాలను సభకు వచ్చిన ఆశేష జనవాహినికి స్థానిక జనసేన శ్రేణులు పంచారు. ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ గారి వెంట పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు.