ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. మొదటి నుంచి రాపాక వైఖరి అధికార వైసీపీకి అనుకూలంగా ఉండడంతో ఇప్పటికే పార్టీ ఆయన్ని పక్కన పెట్టి వివిధ సమావేశాలకి దూరంగా ఉంచడం అందరికీ తెలిసిన విషయమే అయినా నిన్నటి రాపాక కామెంట్స్ తో మరింత దుమారం రేగింది.
ఒక అధికారిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన వ్యక్తిగత చరిష్మా వలనే గెలిచానని, క్షత్రియ సామాజిక వర్గం తో సహా అన్ని సామాజిక వర్గాల్లో తనకు పరపతి ఉందని తనకు మొదటి నుంచి వైసీపీతో అనుబంధం ఉందని గుర్తు చేసుకుంటూ కొన్ని అనివార్య కారణాల వల్లే తనకి వైసీపీ సీట్ దక్కలేదని అయినా ఇప్పుడు తనని వైసీపీ శాశన సభ్యుడిగా భావించాలని విజ్ఞప్తి చేసారు. ముఖ్యమంత్రి జగన్ చొరవతో గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టి అందరూ ఒక్క తాటిపై నిలబడి వైసీపీ బలోపేతం పై దృష్టి సారించాలని సూచించారు.
కేవలం ఒక కులం వారు ఓటు వేస్తే ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదని అన్ని కులాల మద్దతు లేకే పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారని నియోజకవర్గ వర్గ అభివృద్ధి లో భాగంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన హయాంలో జరిగిన గతంలో అభివృద్ధి వల్లే ప్రజలు తనని గెలిపించారని అన్ని కులాల్లో తనకు మద్దతు ఉందని జనసేన పార్టీ విజ్ఞప్తి మేరకే నేను పోటీ చేసాను తప్ప తానుగా ఆ పార్టీని సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఈ కామెంట్స్ పై కోపంగా ఉన్న జనసేన కార్యకర్తలు రాపాక రాజీనామా చేసి తిరిగి గెలిస్తే ఆయన మాటలకు విలువ ఉంటుందని ఎద్దేవా చేస్తున్నారు.