ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కంటే సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. దశల వారీగా అమలు చేస్తున్నా, సంక్షేమ పథకాల ఫలాలు లబ్దిదారుల ఖాతాలోకి చేరడంతో ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఘన విజయం సాధించిందనే చెప్పాలి. మొత్తం రాష్ట్ర చరిత్రలోనే ఇంత భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రభుత్వం లేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒక వైపు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పార్టీ ప్రమేయం లేకుండానే ప్రత్యక్షంగా లబ్ధిదారుల గుర్తిస్తున్నారు. దళారుల ప్రమేయం లేకుండా చేయడంలో ముఖ్యమంత్రి సఫలీకృతమయ్యారు అని చెప్పక తప్పదు. దీనివల్ల అధికంగా ఖజానాపై భారం పడుతున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. అయితే రోజురోజుకూ పెరుగుతున్న అప్పుల భారంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనించడంపై ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వపరంగా సఫలమైన పార్టీపరంగా వైసీపీలో అసంతృప్తి రాజుకుంది. సంక్షేమ పథకాల వల్లే ఓట్లు రావని, స్థానికంగా ఉన్న కార్యకర్తలని సైతం పరిగణనలోకి తీసుకోవాలని కొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. క్రమంగా పేరుకుపోతున్న అసంతృప్తిని పార్టీలో తొలగించకపోతే ఎన్నికల సమయానికి కేడర్ సహరించే పరిస్థితి ఉండకపోవచ్చని, తద్వారా స్థానిక నాయకత్వం ఇబ్బంది పడే అవకాశం ఉందని పార్టీకి చెందిన చాలా మంది సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున తప్పనిసరిగా ఈ అంశంపై దృష్టి సారించాలని పార్టీ శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. గతంలో టిడిపి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ఓటమి పాలయిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు
