ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ కీలక రోల్ పోషించబోతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఆరు శాతం ఓటు బ్యాంకు తెచ్చుకున్న జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గంలో ఎంతో కొంత ఓటు బ్యాంకు కలిగి ఉన్న క్రమంలోజనసేన పార్టీని తమ వైపు పూర్తిగా మలుచుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రత్యేక వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున భారతీయ జనతా పార్టీ స్వయంగా బలపడే అన్ని కార్యక్రమాలు రూపొందిస్తూనే పార్టీ పటిష్టత గురించి అన్ని జిల్లాలకు కొత్త కార్యవర్గాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తూ.. తను మిత్రపక్షమైన జనసేన పార్టీ భవిష్యత్తు గురించి కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం వస్తుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన రాజకీయ శూన్యతను సొమ్ము చేసుకునే క్రమంలో జనసేన బీజేపీ కూటమి తన మిత్రపక్షమైన జనసేన పార్టీకి కేంద్రంలో స్థానం కల్పిస్తే అది మరింత గా ఇరుపక్షాలకు లభిస్తుందని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
రానున్న కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా జనసేన కేడర్లో మరింత ఆత్మవిశ్వాసం నింపి వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులను జనసేన, బీజేపీ కూటమి వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం నిర్మాణపరంగా, నాయకత్వపరంగా ఇబ్బందులు పడుతున్న క్రమంలో, సమకాలీన ప్రజా మస్యలపై పోరాటం చేయడంలో అమరావతి ఉద్యమాన్ని నడిపించడంలో దారుణంగా విఫలమైన కారణంగా ఆ పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత దెబ్బతిన్నది. అమరావతి అంశంలో గాని మూడు రాజధానులు అంశంలో గాని ఆ పార్టీ స్పష్టమైన విధానం అవలంబించకపోవడంవల్ల ఆ పార్టీ ప్రతిష్ఠ క్రమంగా అంతరించి పోతుందని మధ్యేమార్గంగా అదును చూసి జనసేన, బీజేపీ కూటమి ప్రజా సమస్యల పై ఒక ప్రణాళిక ప్రకారం ఉద్యమ కార్యాచరణ నిర్ణయించుకుని తాము కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం ద్వారా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గం ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ కి అద్భుతమైన భవిష్యత్తు ఉందని కామెంట్ చేయడం వెనక ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో పవన్ భాగస్వాని కాబోవటమే కారణమని భావిస్తున్నారు. ఇదే జరిగితే జన సైనికులు ఆనందానికి హద్దు ఉండదు.
