పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత జగన్ సర్కార్ పాలనకు అతికినట్టు సరిపోతుంది. సంక్షేమ పథకాల ద్వారా కోటానుకోట్లు ప్రజలకు ఇస్తున్నామని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటి నివేదిక నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం అక్షరాస్యతపై జరిపిన సర్వేలో ఆంధ్ర ప్రదేశ్ అట్టడుగు స్థానంలో నిలిచింది. వారు విడుదల చేసిన గణాంకాల పరంగా చూస్తే బీహార్ కంటే వెనకబడి ఉంది. దీనిపై టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరక్షరాస్యత పెరిగిందని అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రాల పట్టికలో అట్టడుగు స్థానానికి దిగజారిందని పేర్కొంది.
96% అక్షరాస్యతలో కేరళ అగ్రస్థానంలో 88.7% ఢిల్లీ రెండోస్థానంలో నిలవగా ఆశ్చర్యకరంగా మౌలిక సదుపాయాలు అంతగా లేని ఈశాన్య రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్, అస్సాం, తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చివరి ఐదు స్థానాల్లో 73% ఉత్తర ప్రదేశ్, 72.8% తెలంగాణ, 70.9% బీహార్,69.7% రాజస్థాన్, 66.4 % శాతంతో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయికి పడిపోయింది.
బాలబాలికల నిష్పత్తిలో కూడా 13.9% శాతంతో భారీవ్యత్యాసం కలిగి ఉంది. సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పన లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్య పై సరైన అవగాహన కల్పించ లేకపోవడం వలన రోజు రోజుకి బడుల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. అమ్మ ఒడి లాంటి పథకాల కోసం చెవులు చిల్లులు పడే రీతిలో పబ్లిసిటీ ఊదరగొడుతున్న ఏపీ సర్కారు ఇప్పటికైనా కళ్లు తెరిచి ఉచిత పథకాల ద్వారా మంచినీళ్ల ప్రాయంగా డబ్బులు పంచడం కాకుండా ఆ డబ్బుతో విద్యాసంస్థల్లో మెరుగైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం, విద్యార్థులను బడుల వైపు అడుగులు వేసేలా చర్యలు తీసుకోవడం చేస్తే కొంతైనా ప్రయోజనం ఉంటుంది.
