ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్టుగా ఉందని తెలుగునాట ఒక సామెత. జమిలి ఎన్నికల సమరం ముందున్న తరుణంలో రాజకీయ పార్టీల వ్యూహం ఏమిటో అనేది చర్చనీయాంశంగా మారింది. తరుముకుని వస్తున్న ఎన్నికల రణరంగంలో ఏవిధంగా ముందుకు వెళ్ళాలి అనే ప్రణాళికలతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. జమిలికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రంతో తమ నిర్ణయాన్ని స్పష్టం చేశాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా తమ శ్రేణులని ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ఆదేశించారు.
జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి నిర్మాణం లేకపోవడంతో ఆపార్టీ భవిష్యత్ పై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. 13 జిల్లాల్లో పార్టీని తీవ్రంగా వేధిస్తున్న నాయకత్వ సమస్య పై దృష్టి పెట్టలేకపోవడం, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పార్టీకి దూరంగా ఉండటంతో కేడర్ లోనైరాశ్యం కనిపిస్తోంది. పార్టీ నిర్మాణం గురించి గానీ కార్యకర్తల సమస్యలు గురించి గానీ కనీసం చర్చ కూడా జరగని దుస్థితి పార్టీలో ఉంది. సహజంగా నిర్మాణంలో భాగంగా వేసే గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీలు పూర్తిగా నియమించకపోవడంతో బాటు ఉన్న చోట్ల ఉన్న కమిటీలు క్రియాహీనంగా ఉండటంతో పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి. గ్రామస్థాయిలో కూడా ఇతర పార్టీలతో పోటీపడలేక చతికిల పడుతున్నాయి. డిసెంబర్ చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరువుతాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీకిమరోసారి పరాభవం తప్పకపోవచ్చు.
ఇటువైపు బలమైన క్యాడర్ ఉన్న టీడీపీ అధికారంలో ఉన్న వైసీపీ వేసే ఎత్తుగడతో చేష్టలుడిగి చూస్తుంటే.. కొందరు జనసేన కార్యకర్తలు అధినేత వైఖరిపై సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. రాజకీయ పార్టీ నడిపించే విధానం ఇది కాదని ఇటువంటి ధోరణి మార్చుకోకపోతే దీర్ఘకాలంలో పార్టీ మనుగడ కష్టమని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే అసంతృప్తితో ఉన్న కొంతమంది నాయకుల్ని టీడీపీ వైసీపీ తమవైపు ఆకర్షించేందుకు అవకాశం ఉన్నందున అధినేత తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీ సంక్షేమ అజెండాను టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని సొంతం చేసుకుంటే గత ఎన్నికల్లో వచ్చిన ఓటు శాతం కూడా నిలుపుకునే అవకాశం ఉండకపోవచ్చని ఆందోళన చెందుతున్నారు.
పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్ష తర్వాత పార్టీలో మార్పులు జరుగుతాయా లేక ఎక్కడ వేసిన గొంగడి అక్కడేనా అనేది భవిష్యత్తులో తేలనుంది.
