కనపడే అపజయాల వెనుక జగన్మోహన్ రెడ్డి సర్కారు నైతిక విజయం సాదించిందా అంటే.. అవుననే సమాధానం వస్తోంది కొన్ని సందర్భాల్లో అమరావతి రాజధాని పోరాటంలో టీడీపీ తనమునకలుగా ఉంటే, నెమ్మదిగా వైసీపీ తన ప్రచారాన్ని చాపకింద నీరులా చేసుకుని పోతోంది. నిజానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వం ఇరుకున పడింది అని భావిస్తున్న క్రమంలో నాణానికి రెండో వైపు ఇది క్రమంగా వైసీపీకే లాభిస్తుందని కొన్ని అంచనాలు ఉన్నాయి. కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై భిన్నమైన వాదనలు ఉన్నా ప్రతిపక్ష పార్టీలు అవలంబిస్తున్న వ్యూహంతో అమరావతి రైతులు మరింత నష్టపోయే దిశగా ప్రయాణం చేస్తున్నారని చెప్పక తప్పదు. ప్రభుత్వంతో చర్చలు జరపకుండా ఉండటంవల్ల రైతులు మిగిలిన ప్రాంతాల దృష్టిలో దోషులగా మిగులుతున్నారు.
ఇప్పటికే టీడీపీ ఇచ్చిన అమరావతే మన రాజధాని అనే పిలుపుకు రాయలసీమ, ఉత్తరాంద్ర ప్రాంతాల్లో స్పందన లేదు. విశాఖపట్నం జిల్లాలో టీడీపీ మొత్తం ఆత్మ రక్షణలో పడింది. అధినేత తీరుకు వ్యతిరేకంగా కొంతమంది మీడియాముఖంగా తమ అసంతృప్తి తెలియజేస్తున్నారు. రేపు ఎన్నికల సమయంలో వచ్చే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇక ముందు అమరావతి అనే అంశంపై తమని సంప్రదించంవల్ల ప్రయోజనం లేదని పార్టీతో పాటు తనకు కూడా నష్టమని మెజారిటీ టీడీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక బీజేపీ, జనసేన కూడా అమరావతి అంశాన్ని పక్కనపెట్టి తమ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇది ప్రాంతాల మధ్య వివాదంగా మారితే తమకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవని వైసీపీ వేసిన ఉచ్చులో తాము ఇరుక్కుని తర్వాత నష్ట నివారణ కోసం ఇబ్బందులు పడేకంటే ఇప్పటినుంచే స్పష్టమైన విధానాన్ని అవలంబిస్తే మేలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి
ఈ వ్యవహారం లో టీడీపీ ఒంటరిగా మిగిలి చివరకు తాను అనుకున్న లక్ష్యం చేరుకోలేక కొన్ని ప్రాంతాల దృష్టిలో దోషిగా నిలబడి రాజకీయంగా తీవ్రమైన నష్టం పొందితే జగన్ వ్యూహం సఫలమైనట్టే.
