తెలుగుదేశం పార్టీ మొదటి నించి బడుగు బలహీన వర్గాలు పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే.కానీ ఇప్పుడు ఆ పార్టీకి ఆయా వర్గాల మద్దతు ఉందా అనేది ఎవరికీ అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇటు సీమాంధ్రలో అటువంటి తెలంగాణలో దిగజారుతున్న ఆ పార్టీ పరిస్థితి పై నాయకులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో పార్టీ సైద్ధాంతిక లోపాలపై చర్చ జరుగుతోంది.
కొత్త తరానికి రాజకీయ భవిష్యత్ ఇవ్వడంలో ముందున్న పార్టీ ఇప్పుడు వృద్ధ తరం నాయకులతో నిండిపోయింది.పార్టీ మూలాలకి కారణమైన బీసీలు ఇప్పుడు ఆ పార్టీ వైఖరిపై అసంతృప్తిలో వున్నారు. అధికారానికి వచ్చిన కొత్తలో పార్టీ తీసుకున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని ప్రశంసలు పొందిన సందర్భాన్ని సీనియర్లు గుర్తు చేసుకుంటున్నారు.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కి భిన్నంగా కార్పొరేట్ వర్గాలు ఆ పార్టీని చేతిలోకి తీసుకుని పార్టీలో సీనియర్ల మాట ని పక్కన పెట్టడం క్రమంగా జరగడంతో పార్టీలో అసంతృప్తి మొదలయింది. తెలంగాణ లో కూడా బలమైన కేడర్ ఉన్నప్పటికీ టీడీపీ నాయకత్వలోపంతో అక్కడ దాదాపుగా కనుమరుగయ్యింది.
ఇక సీమాంధ్ర విషయానికి వస్తే చంద్రబాబు నాయకత్వంలో పార్టీ ఒక ఎన్నికల్లో ఘన విజయం సాధించినా అస్తవ్యస్త విధానాలు,అవినీతి,పెట్టుబడిదారుల జోక్యంతో మరింతగా దిగజారి అతి త్వరలోనే ప్రజాదరణ కోల్పోయింది. కేవలం ప్రచార ఆర్భాటాలుకు మాత్రమే ప్రభుత్వం పరిమితం కావడం,అమరావతి నిర్మాణంలో వైఫల్యాలను అధిగమించలేకపోవడం, క్షేత్ర స్థాయిలో సైతం అవినీతి ఆపార్టీని ప్రజలకు దూరం చేసాయి.విజనరీగా పేరున్న చంద్రబాబు అనుభవాన్ని నమ్మి వెంట నడిచిన మిత్ర పక్షాలు కూడా క్రమంగా దూరంజరగడంతో ఇక పార్టీ వంటరిగా మిగిలిపోయింది.
ఎన్నికల ముందు భారతీయ జనతాపార్టీతో వైరం కొంతమేర ఆమోదం వచ్చినా కాంగ్రెస్ తో కలయిక వల్ల సుదీర్ఘంగా పార్టీతో ఉన్న అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.ఇటు ఢిల్లీలో కూడా చక్రం తిప్పలేక అటు రాష్ర్టంలో వైసీపీని ఎదుర్కోలేక పార్టీ పూర్తిగా చతికిలపడి పోయింది.అయినా ఇంకా బలమైన కేడర్, సంస్థాగత నిర్మాణం ఉన్న టీడీపీని తక్కువగా అంచనా వేసి స్థితిలో రాజకీయ పార్టీలో లేవు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుని గంపగుత్తగా సొంతం చేసుకుంటే తప్ప పార్టీ మళ్లీ బలపడే అవకాశం లేదని సీనియర్లు చెబుతున్నారు.
లోకేష్ యువ నాయకత్వం పై సీనియర్లకి సందేహాలు వున్నా ప్రస్తుతానికి ఎన్నికల సమయం వరకూ వేచిచూసి, అప్పుడు పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో 40 సంవత్సరాల టీడీపీ భవిష్యత్ కి రానున్న ఎన్నికలు కీలకం కానున్నాయి.