ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల అనంతరం జనసేన పార్టీ స్తబ్దుగా ఉండిపోయింది. స్వయంగా అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓటమి పాలవడంతో కేడర్లో తీవ్రమైన నిరాశ అలముకుంది. కొన్ని జిల్లాల్లో ప్రభావితం చేయగలిగే ఓట్లు వచ్చినా అవి సీట్లు గా మారడం లో పార్టీ తీవ్ర వైఫల్యం మూటగట్టుకుంది. ముఖ్యంగా ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా నడిపించే నాయకులు లేక ఇబ్బందుల పాలయింది. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర సరిగా నిర్వహించడం లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ అవకాశాన్ని తాము ఉపయోగించుకోవాలని జనసేన భావిస్తోంది.
ఇదిలా ఉండగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష అనంతరం పార్టీ నిర్మాణంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే చాప కింద నీరులా కొనసాగుతున్నాయని కొంతమంది పవన్ సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే అన్ని జిల్లాలకు కార్యవర్గం నిర్మించి పార్టీలో కొత్త జవసత్వాలు పెంపొందించాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున ప్రతి అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అన్ని జిల్లాల కార్యవర్గాలు అందరికీ సమ న్యాయం ఉండేలా చూడాలని ఆయన పార్టీ ముఖ్యనేతలకి దిశానిర్దేశం చేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీతో ఇప్పటికే ఒక అవగాహనతో ఉన్నందున ఏయే స్థానాల్లో జనసేన పార్టీ అత్యంత ప్రభావం చూపించగలదో ఆయా స్థానాలపై దృష్టి సారించాలని, బలహీనంగా ఉన్న రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ కొంతమంది ముఖ్యనేతలకు భాద్యతలు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ముందు పార్టీ కూడా వలసలును ప్రోత్సహించే విధానం తో బాటు మెజార్టీ ఓటు బ్యాంకు ఉన్న కాపు సామాజికవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఒక సారి జరిగిన పరాభవం మళ్లీ జరగకుండా సాధ్యమైనంత జాగ్రత్తలు తీసుకోవాలని కలసి వచ్చే ప్రతి నాయకుడు పార్టీలోకి ఆహ్వానించాలనీ, ఎన్నికల నాటికి పార్టీని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బలమైన ప్రభావం చూపించాలని పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నట్టు, దీనిపై నిత్యం సలహాలు సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.