భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ విస్తరణ కోసం సన్నాహాలు చేస్తోంది. దానిపై అధినాయకత్వం సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లే ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. సోము వీర్రాజు అధ్యక్షతన కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించడానికి అన్ని సిద్ధం చేసిందని వార్తలు వస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో బలమైన నిర్మాణం చేసి దశలవారీగా బలాన్ని పెంపొందించుకునే ప్రణాళికను సిద్ధం చేసుకుంది. కరోనా కారణంగా గతంలో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలలో చాలా స్థానాల్లో కూటమి తరపున అభ్యర్థులు లేని పరిస్థితి. ఒకవేళ రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలో ప్రకటించిన షెడ్యూల్ ని రద్దు చేసి కొత్తగా షెడ్యూల్ని రిలీజ్ చేస్తే ఈసారి కచ్చితంగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను పోటీలో నిలిపే ప్రయత్నాలు చేస్తోంది.
జనసేనతో పొత్తు ఉన్నందున ఆపార్టీతో కలిసి పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర బీజేపీ నాయకులని ఆదేశించారు.ప్రజా సమస్యలపై పోరాటంలోనూ, ఉమ్మడి కార్యాచరణతో వెళ్లాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ప్రస్తుతానికి ఆత్మ రక్షణ ధోరణిలో ఉన్నందున బీజేపీ జనసేన ఉమ్మడి పోరాటాలు చెయ్యడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉన్నట్టు ఆయన అభిప్రాయపడుతున్నారు. మిత్ర ధర్మాన్ని పాటిస్తూనే తమ సొంత పార్టీ బలపడటంపై కమలనాథులు దృష్టి సారిస్తున్నారు.
టీడీపీ నుంచి భారీ సంఖ్యలో వలసలు కూడా బీజేపీలోకి వచ్చే అవకాశం ఉండటంతో వలసలు ప్రక్రియ పూర్తయ్యాక కార్యవర్గాన్ని నియమిస్తే బావుంటుందని కొంతమంది పార్టీ నాయకులు భావిస్తున్నారు. వైసీపీ నుంచి కూడా కొంతమంది అసంతృప్త నాయకులు కూడా బీజేపీ అధిష్టానంతో టచ్ లో వున్నట్టు సమాచారం.గొడవరి జిల్లా కు చెందిన ప్రముఖ నాయకుడు ఈ వ్యవహారాన్ని చాపకింద నీరులా కొనసాగిస్తున్నట్లుగా భావిస్తున్నారు. బీజేపీ జనసేన సంయుక్త కూటమి ఎన్నికల నాటికి ఏమేరకు బలపడుతుందో చూడాలి.