ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన చాలామంది సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వలసలు తెలుగుదేశం పార్టీ నుంచి అధికంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో చాలా మంది సీనియర్ నాయకులు బిజెపిలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. పార్టీలో చేరిన తర్వాత వారంతా క్రియాశీలకంగా ఉంటున్నారా లేదా అనే అంశం పక్కన పెడితే వలసలు మాత్రం యధావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి.
మొన్నటికి మొన్న టిడిపి సీనియర్ నాయకుడు దివంగత ఎర్రన్నాయుడు తనయుడు శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు బిజెపి తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఆయన బిజెపి లో చేరే వార్తలపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను ఖండిస్తూ ఇంతవరకూ ఎటువంటి ఖండనా విడుదల చేయలేదు. భారతీయ జనతా పార్టీలో చేరే ఆలోచనలో ఉండటం వల్లే ప్రస్తుతానికి టీడీపీకి దూరంగా ఉండటం జరుగుతుందని తెలుగుదేశం వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇదిలా ఉండగా వరుస వలసలు టిడిపిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు కూడా వదిలివేయటం పార్టీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనిపై సత్వరమే ఏదో విధమైన చర్యలు తీసుకోవాలని పార్టీని కాపాడుకోవాలని ఒక వ్యూహం ప్రకారం తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీ దెబ్బ తీయడానికి ప్రయత్నం చేస్తోందని పార్టీలో కొందరు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో కొన్నాళ్ళు వేచి చూస్తేగాని తెలీదు.
