భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా సోము వీర్రాజు రాక బిజెపిలోని ఒక వర్గంలో కాక పుట్టిస్తుంది. ఆయన కంటే ముందు అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశంపై పెద్దగా విమర్శలు చేసేవారు కాదు. కానీ సోము అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక అధికార పక్షం తో పాటు ప్రతిపక్షం లో ఉన్న తెలుగు దేశాన్ని కూడా ఎడాపెడా విమర్శలతో ఒకరకంగా చావగొట్టి చెవులు మూస్తున్నారు. తెలుగుదేశాన్ని ఎక్కువగా టార్గెట్ చేయడం వలన టీడీపీ నుండి తమ పార్టీలోకి వచ్చిన తెలుగు తమ్ముళ్ళు డిఫెన్స్ లో పడేలా చేసారు. దీనికి కారణం ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 18 శాతం ఓటు బ్యాంకు కలిగిన భారతీయ జనతా పార్టీ ఈ రోజున జాతీయ స్థాయిలో అధికారంలో ఉండి రాష్ట్రంలో అట్టడుగు స్థాయికి చేరడానికి గల కారణం తెలుగుదేశమే అని సోము బలంగా విశ్వసిస్తున్నారు.
స్వతహాగా సంఘ్ నేపథ్యం కలిగిన నాయకుడు కావడంతో నాకు పార్టీ ప్రయోజనాలు తప్ప వ్యక్తుల ప్రయోజనాలు అవసరం లేదని కుండ బద్దలు కొట్టినట్లు తమ పార్టీ నాయకులకు తను వచ్చీరావడంతోనే హెచ్చరికలు జారీ చేసారు. అయితే తెలుగు దేశం నుండి వచ్చిన కొంతమంది ఈయన టిడిపిని టార్గెట్ చేయడం నచ్చక అయన పై ఫిర్యాదు చేయడానికి కేంద్రంలో బిజెపి అధిష్టానం వద్దకు వెళ్లారని తెలిసింది.
పార్టీ ముఖ్య పెద్దల వద్ద సోము పై పలు ఫిర్యాదులు ఆరోపణలు అందించారు. ఇక్కడే వారికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. బిజెపి అనేది జాతీయ పార్టీ అని పార్టీకి ఎవరిని, ఎప్పుడు టార్గెట్ చెయ్యాలో స్పష్టత ఉందని, ఇందులో ఎవరి జోక్యం సహించేది లేదని , భవిష్యత్తులో కూడా టీడీపీతో జట్టు కట్టే అవకాశం ఉండదని ఒకింత గట్టిగానే చెప్పినట్లు తెలిసింది. భారతీయ జనతా పార్టీ అనేది మీరు చెప్పినట్లు నడిచేది కాదని ముందు పార్టీలో ఎలా నడుచుకోవాలో మీరు తెలుసుకోండి అని చీవాట్లు పెట్టారని అంతర్గత సమాచారం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న సోము వీర్రాజు అధ్యక్షత లోనే నడవాల్సి ఉందని స్పష్టం చేసి ఇంతకాలం బీజేపీ లో ఉంటూ తెలుగుదేశం స్వరాన్ని వినిపిస్తున్న ఆ వర్గానికి సోము వీర్రాజు చేతికి పగ్గాలు ఇవ్వడం ద్వారా చెక్ పెట్టింది కేంద్ర నాయకత్వం.
