అధికారంలోకి రాకముందు అమరావతికే పూర్తి మద్దతు అని ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రజల్ని గందరగోళంలో పడేసింది. ఒకవైపు రాజధాని అంశం రగులుతూ ఉండగా విశాఖలో రాజధాని ఏర్పాటుకు సన్నద్ధం అవుతుంది. ఈ విషయంపై హైకోర్టు ఉత్తర్వులు అమలులో ఉన్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖకు పరిపాలనా రాజధాని తరలించే విధంగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
రాజధాని కొరకు భూములు ఇచ్చిన రైతులు పోరాటం కొనసాగుతుండగానే, అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండకూడదు అంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుని అమరావతి నుండి శాసన రాజధాని కూడా తరలించాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను అని ఆయన వ్యాఖ్యానించారు.
దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి గత ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులు జీవితాలను నాశనం చేయడానికి మీకు హక్కు ఎవరిచ్చారు అంటూ వామపక్షాలు ఆందోళనకు దిగాయి. ఇదిలా ఉండగా రాజధాని అంశం పై హైకోర్టులో ఒకపక్క పోరాటం జరుగుతుండగా ప్రభుత్వంలో బాధ్యత కలిగిన స్థానంలో ఉండి అంత నిర్లక్ష్యం పూర్వకంగా ఎలా మాట్లాడతారని, భూములు ఇచ్చిన రైతులు ఆయన వ్యాఖ్యలతో ఆందోళన చెందే విధంగా మాట్లాడడం సమంజసం కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.