ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతున్న రాజధాని అంశంపై ప్రతిపక్ష పార్టీలని వైసీపీ ఆత్మరక్షణలోకి నెట్టింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అధికార వికేంద్రీకరణ మరియ అభివృద్ధి వికేంద్రీకరణ ప్రకటన ఒక్కసారిగా టీడీపీని ఆత్మ రక్షణ ధోరణిలోకి నెట్టింది. తమ కలల సౌధం అయిన అమరావతిని జగన్ కూల్చేస్తున్నారని టీడీపీ మొదలుపెట్టిన అమరావతి ఉద్యమానికి సొంత పార్టీలోనే సరైన మద్దతు దొరకడం లేదు. క్రమంగా రోజుల సాగుతున్న ఉద్యమం ఇతర ప్రాంత నాయకుల మద్దతు లేక శిబిరాలు వెల వెల బోతున్నాయి. రాజకీయంగా టీడీపీ మాత్రమే ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించడంతో మిత్ర పక్షాలు కూడా మొక్కుబడిప్రకటనలకు పరిమితం అయిపోయాయి.
బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు క్రమంగా రాజధాని రైతులకు న్యాయం చెయ్యాలనే డిమాండ్ కి పరిమితం అయిపోయాయి. అభివృద్ధి చేస్తూనే సింహభాగం సంక్షేమ అజెండా అమలు చేస్తున్నామని అన్ని ప్రాంతాల్లో సమగ్రమైన అభివృద్ధి మా విధానం అంటూ వైసీపీ ఎదురుదాడికి దిగడంతో అన్ని పార్టీలు ఆత్మరక్షణలో పడ్డట్టు కనిపిస్తుంది. తాము ఎక్కువగా అమరావతి ఉద్యమానికి అనుకూలంగా మాట్లాడితే రేపు ఎన్నికల సమయంలో ఉత్తరాంద్ర రాయలసీమ జిల్లాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున ప్రస్తుతానికి మౌనమే మేలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.
మొత్తానికి జగన్ తన ద్విముఖ వ్యూహంతో మానసికంగా రాజకీయ పార్టీలని విజయవంతంగా గందరగోళంలోకి నెట్టగలిగారు. అవాంతరాలు తొలిగిన తర్వాత.. ప్రభుత్వం విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేసి రాజకీయ లబ్ది కోసం ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీని కోసం దీర్ఘకాలిక వ్యూహం ఆయన పాటిస్తూనే అమరావతి ప్రాంతంలో రైతులకు విధానపరమైన పరిష్కారం చూపించి కృష్ణా,గుంటూరు జిల్లాల్లో కూడా పార్టీ పట్టు సడలకుండా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలని ఆయన దోషిగా నిలబెట్టటంలో కొంతమేరకు విజయవంతం అయినట్టు ప్రస్తుత పరిస్థితులని గమనిస్తే తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా జగన్ నైతిక విజయం క్రిందే లెక్క.