ఆంద్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు నియామకం తర్వాత టీడీపీకి మరింత కష్టాలు పెరిగినట్టు చాలామంది అభిప్రాయ పడుతున్నారు. దశాబ్దాలుగా టీడీపీతో అనుబంధం ఉన్న కొంతమంది టీడీపీ సానుభూతి పరులైన నేతలు కూడా వీర్రాజు దూకుడుకు కళ్లెం వేసే శక్తి లేక బిత్తరపోయి చూస్తున్నారు. అధ్యక్షుడు గా ప్రమాణ స్వీకారం చెయ్యకముందే ఆయన టీడీపీ పై వివిధ ఛానళ్లలో చెలరేగిన తీరు చూస్తుంటే భవిష్యత్ లో ఆపార్టీ తో పొత్తు కోరుకునే టీడీపీ సీనియర్లు సైతం మౌనాన్ని ఆశ్రయించారు.
బీజేపీ ఆంద్రప్రదేశ్ ని నిర్లక్ష్యం చేసిందనే ఒక వర్గం ప్రచారాన్ని సోము తనదైన శైలిలో తిప్పికొడుతున్నారు. ఆయనకు సోషల్ మీడియాలో మిత్రపక్షమైన జనసేన మద్దతు విపరీతంగా లభిస్తుంది. కొందరు టీడీపీ సానుభూతి పరులైన బీజేపీ నాయకులు ఇకపై భవిష్యత్ లో సోము వైఖరిపై ఆందోళనలో వున్నారు. అమరావతి ఉద్యమంలో పార్టీకి వ్యతిరేకంగా ఒక కార్యక్రమంలో నిరసన తెలియజేసిన ఒక అధికార ప్రతినిధిని సోము పార్టీ నుంచి సస్పెండ్ చేసి తన వ్యతిరేకులకి హెచ్చరిక జారీ చేశారు. వరస పర్యటనలు ప్రముఖుల కలయిక తో పార్టీని పరుగులు పెట్టిస్తున్న తీరుతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు.
ఇక భవిష్యత్ లో కూడా టీడీపీతో పొత్తు ఉండదని కేడర్ కి స్పష్టంగా చెబుతూ ప్రమాణ స్వీకారం తర్వాత పార్టీని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నట్టు సన్నిహితుల సమాచారం. దీనిపై కొన్ని ప్రయోజనాల మేరకు బీజేపీలో కొనసాగుతున్న కొంతమంది గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు కక్కలేక, మింగలేక పార్టీలో ఇమడలేక ఇబ్బందులు పడుతున్నారు. సోము దూకుడుతో పార్టీకి జరిగే మేలు ఏమిటో వేచిచూద్దాం.
